- 1 భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్ట బడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.
- 2 మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. కాబట్టి పరలోకమునుండివచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము.
- 3 ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గు చున్నాము.
- 4 ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము.
- 5 దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే;మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మన కనుగ్రహించియున్నాడు.
- 6 వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొను చున్నాము
- 7 గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామనియెరిగి యుండియు, ఎల్లప్పుడును ధైర్యముగలవారమై యున్నాము.
- 8 ఇట్లు ధైర్యము గలిగి యీ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము.
- 9 కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై యుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము.
- 10 ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.
- 11 కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడినవారము; మీ మనస్సాక్షులకు కూడ ప్రత్యక్షపరచబడియున్నామని నమ్ముచున్నాను.
- 12 మమ్మును మేమే మీ యెదుట తిరిగి మెప్పించుకొనుట లేదు గాని, హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడువారికి ప్రత్యుత్తర మిచ్చుటకు మీకు ఆధారము కలుగవలెనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము.
- 13 ఏలయనగా మేము వెఱ్రివారమైతిమా దేవుని నిమిత్తమే; స్వస్థబుద్ధిగలవారమైతిమా మీ నిమిత్తమే.
- 14 క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు,
- 15 జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము.
- 16 కావున ఇకమీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము; మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు ఎరుగము.
- 17 కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;
- 18 సమస్తమును దేవుని వలననైనవి; ఆయన మనలను క్రీస్తుద్వారా తనతో సమాధానపరచుకొని, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను.
- 19 అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను.
- 20 కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమైదేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము.
- 21 ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.
2 Corinthians 05
- Details
- Parent Category: New Testament
- Category: 2 Corinthians
2 కొరింథీయులకు చాప్టర్ 5