- 1 ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసి కొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.
- 2 మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి; మే మెవనికి అన్యాయము చేయలేదు, ఎవనిని చెరుపలేదు, ఎవనిని మోసము చేయలేదు.
- 3 మీకు శిక్షావిధి కలుగవలెనని నేనీలాగు చెప్పలేదు. చని పోయినగాని జీవించిన గాని మీరును మేమును కూడ ఉండవలెననియు మీరు మా హృదయములలో ఉన్నారనియు నేను లోగడ చెప్పితిని గదా
- 4 మీ యెడల నేను బహు ధైర్యముగా మాట లాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాల అతిశయము కలదు, ఆదరణతో నిండుకొనియున్నాను, మా శ్రమయంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగు చున్నాను.
- 5 మేము మాసిదోనియకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను; వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను.
- 6 అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాకవలన మమ్మును ఆదరించెను.
- 7 తీతు రాకవలనమాత్రమే కాకుండ, అతడు మీ అత్యభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు, తాను మీ విషయమై పొందిన ఆదరణవలన కూడ మమ్మును ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగ సంతోషించితిని.
- 8 నేను వ్రాసిన పత్రికవలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను; నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలముమట్టుకే దుఃఖ పెట్టెనని తెలిసికొనియున్నాను.
- 9 మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదుగాని మీరు దుఃఖపడి మారుమనస్సు పొందితిరని యిప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మావలన మీరు నష్టము పొందకుండుటకై, దైవచిత్తానుసారముగా దుఃఖపడితిరి.
- 10 దైవచిత్తాను సారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును.
- 11 మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన యీ దుఃఖము ఎట్టి జాగ్రతను ఎట్టిదోష నివారణకైన ప్రతివాదమును ఎట్టి ఆగ్రహ మును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. ఆ కార్యమునుగూర్చి సమస్త విషయములలోను మీరు నిర్దోషులై యున్నారని ఋజువు పరచుకొంటిరి.
- 12 నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసినవాని నిమిత్తము వ్రాయలేదు; వానివలన అన్యాయము పొందిన వాని నిమిత్తమైనను వ్రాయలేదు; మాయెడల మీ కున్న ఆసక్తి దేవునియెదుట మీ మధ్య బాహాటమగుటకే వ్రాసితిని.
- 13 ఇందుచేత మేము ఆదరింపబడితివిు. అంతే కాదు,మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతుయొక్క ఆత్మ మీ అందరివలన విశ్రాంతిపొందినందున అతని సంతోషమును చూచి మరి యెక్కువగా మేము సంతోషించితివిు.
- 14 ఏలయనగా, నేనతని యెదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు మేమేలాగు అన్నిటిని మీతో నిజముగా చెప్పితిమో ఆలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను.
- 15 మరియు మీరు భయముతోను వణకుతోను తన్ను చేర్చుకొంటిరని అతడు మీయందరి విధేయతను జ్ఞాపకముచేసికొనుచుండగా, అతని అంతఃకరణము మరి యెక్కువగా మీ యెడల ఉన్నది.
- 16 ప్రతివిషయములోను మీవలన నాకు ధైర్యము కలుగుచున్నది గనుక నంతోషించుచున్నాను.
2 Corinthians 07
- Details
- Parent Category: New Testament
- Category: 2 Corinthians
2 కొరింథీయులకు చాప్టర్ 7