- 1 అతిశయపడుట నాకు తగదు గాని అతిశయ పడవలసివచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును.
- 2 క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.
- 3 అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు.
- 4 అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరములేక కొని పోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.
- 5 అట్టివాని గూర్చి అతిశయింతును; నా విషయమైతేనో నా బలహీనతయందే గాక వేరువిధముగా అతిశయింపను.
- 6 అతిశయపడుటకు ఇచ్ఛయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నాయందు ఎవడైనను చూచినదానికన్నను నావలన వినినదానికన్నను నన్ను ఎక్కువ ఘనముగ
- 7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను.
- 8 అది నాయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని.
- 9 అందుకునా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందె
- 10 నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను.
- 11 నేనవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీచేత మెప్పు పొందవలసినవాడను, ఏలయనగా నేను ఏమాత్రపువాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె నేను ఏ విషయములోను తక్కువ వాడను కాను.
- 12 సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుటవలన, అపొస్తలునియొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను.
- 13 నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములో తప్ప, మరి ఏ విషయములో మీరితర సంఘములకంటె తక్కువ వారైతిరి? నేను చేసిన యీ అన్యాయమును క్షమించుడి.
- 14 ఇదిగో, యీ మూడవసారి మీయొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను; వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తలిదండ్రులకొరకు కాదు తలి దండ్రులే పిల్లలకొరకు ఆస్తి కూర్చతగినది గదా
- 15 కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మలకొరకు బహు సంతోషముగా వ్యయ పరచెదను; నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత యెక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా?
- 16 అది ఆలా గుండనియ్యుడి. నేను మీకు భారముగా ఉండలేదు గాని యుక్తిగలవాడనై మిమ్మును తంత్రము చేత పట్టుకొంటిని అని చెప్పుదురేమో.
- 17 నేను మీ యొద్దకు పంపినవారిలో ఎవనివలననైనను మిమ్మును మోసపుచ్చి ఆర్జించుకొంటినా?
- 18 మీయొద్దకు వెళ్లుటకు తీతును హెచ్చరించి అతనితోకూడ ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి యేమైన ఆర్జించుకొనెనా? మేమొక్క ఆత్మవలననే ఒక్క అడుగు జాడలయందే నడుచుకొనలేదా?
- 19 మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో. దేవుని యెదుటనే క్రీస్తునందు మాటలాడుచున్నాము; ప్రియులారా, మీ క్షేమాభివృద్ధికొరకు ఇవన్నియు చెప్పు చున్నాము.
- 20 ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు, నేను మీకిష్టుడనుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును అసూయయు క్రోధములును కక్షలును కొండెములును గుసగుసలాడుటలును ఉప్పొంగుటలును అల్లరులును ఉండు నేమో అనియు,
- 21 నేను మరల వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపముచేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారుమనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను.
2 Corinthians 12
- Details
- Parent Category: New Testament
- Category: 2 Corinthians
2 కొరింథీయులకు చాప్టర్ 12