- 1 సహోదరులారా, ప్రభువుదినమిప్పుడే వచ్చి యున్నట్టుగా ఆత్మ వలననైనను, మాటవలననైనను, మా యొద్దనుండి వచ్చినదని చెప్పిన పత్రికవలననైనను, ఎవడైనను చెప్పినయెడల
- 2 మీరు త్వరపడి చంచలమనస్కులు కాకుండవలెననియు, బెదరకుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడనుబట్టియు, మనము ఆయనయొద్ద కూడుకొనుటను బట్టియు, మిమ్మును వేడుకొనుచున్నాము.
- 3 మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగుపాపపురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము రాదు.
- 4 ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచు కొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి.
- 5 నేనింకను మీయొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకములేదా?
- 6 కాగా వాడు తన సొంతకాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డ గించునది ఏదో అది మీరెరుగుదురు.
- 7 ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది గాని, యిదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యనుండి తీసి వేయబడు వరకే అడ్డగించును.
- 8 అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.
- 9 నశించుచున్నవారు తాము రక్షింప బడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక, వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన సూచకక్రియలతోను, మహత్కార్యములతోను
- 10 దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును
- 11 ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై,
- 12 అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు.
- 13 ప్రభువువలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మునుబట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమైయున్నాము.
- 14 మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను.
- 15 కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి.
- 16 మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును,
- 17 మీ హృదయ ములను ఆదరించి, ప్రతిసత్కార్యమందును ప్రతిసద్వాక్య మందును మిమ్మును స్థిరపరచును గాక.
2 Thessalonians 02
- Details
- Parent Category: New Testament
- Category: 2 Thessalonians
2 థెస్సలొనీకయులకు 2 ं చాప్టర్ 2