- 1 క్రీస్తు యేసునందున్న జీవమునుగూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయు నది.
- 2 తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన క్రీస్తుయేసునుండియు కృపయు కనికరమును సమాధాన మును కలుగును గాక.
- 3 నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసికొనుచు, నీ కన్నీళ్లను తలచుకొని, నాకు సంపూర్ణా నందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు,
- 4 నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసికొని, నా పితురాచారప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవునియెడల కృతజ్ఞు డనై యున్నాను.
- 5 ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లియైన యునీకేలోను వసించెను, అది నీయందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ము చున్నాను.
- 6 ఆ హేతువుచేత నా హస్తనిక్షేపణమువలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను.
- 7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.
- 8 కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చియైనను, ఆయన ఖైదీనైన నన్నుగూర్చియైనను సిగ్గుపడక, దేవుని శక్తినిబట్టి సువార్తనిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై యుండుము.
- 9 మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు, అనాదికాలముననే క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడినదియు,
- 10 క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షతవలన బయలుపరచబడి నదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను.
- 11 ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడనుగాను అపొస్తలుడనుగాను, బోధకుడనుగాను, నియమింపబడి తిని.
- 12 ఆ హేతువుచేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, నేను నమి్మనవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను; నేను ఆయనకు అప్పగించినదానిని రాబోవు చున్న ఆ దినమువరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను.
- 13 క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవాడవై, నీవు నావలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము;
- 14 నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మవలన కాపాడుము.
- 15 ఆసియలోని వారందరు నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదువు; వారిలో ఫుగెల్లు హెర్మొగెనే అనువా రున్నారు.
- 16 ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారియందు కనికరము చూపునుగాక.
- 17 అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లనుగూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి, కనుగొని, అనేక పర్యాయములు ఆదరించెను.
- 18 మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారముచేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువువలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించును గాక.
2 Timothy 01
- Details
- Parent Category: New Testament
- Category: 2 Timothy
2 తిమోతికి చాప్టర్ 1