- 1 వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.
- 2 దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక పట్టణ ములో ఉండెను.
- 3 ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతనియొద్దకు తరచుగావచ్చినా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను గాని
- 4 అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు-నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను
- 5 ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలోతాననుకొనెను.
- 6 మరియు ప్రభువిట్లనెను అన్యాయస్థుడైన ఆ న్యాయాధి పతి చెప్పిన మాట వినుడి.
- 7 దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొను చుండగా వారికి న్యాయము తీర్చడా?
- 8 ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారినిషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా?
- 9 తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొనియితరులను తృణీ కరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను.
- 10 ప్రార్థనచేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయము నకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి.
- 11 పరిసయ్యుడు నిలువబడిదేవా, నేను చోరులును అన్యా యస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
- 12 వారమునకు రెండు మారులు ఉప వాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను.
- 13 అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచుదేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను.
- 14 అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడ
- 15 తమ శిశువులను ముట్టవలెనని కొందరు ఆయనయొద్దకు వారిని తీసికొనిరాగా ఆయన శిష్యులు అది చూచి తీసి కొనివచ్చిన వారిని గద్దించిరి.
- 16 అయితే యేసు వారిని తనయొద్దకు పిలిచిచిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నాయొద్దకు రానియ్యుడి, దేవుని రాజ్యము ఈలాటివారిది.
- 17 చిన్న బిడ్డవలె దేవుని రాజ్యము అంగీకరింపనివాడు దానిలో ఎంతమాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
- 18 ఒక అధికారి ఆయనను చూచిసద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయన నడిగెను.
- 19 అందుకు యేసునేను సత్పురుషుడనని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు.
- 20 వ్యభిచరింప వద్దు, నరహత్యచేయ వద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తలి దండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పెను.
- 21 అందుకతడుబాల్యమునుండి వీటినన్నిటిని అనుసరించుచునే యున్నాననెను.
- 22 యేసు వినినీకింక ఒకటి కొదువగా నున్నది; నీకు కలిగినవన్నియు అమి్మ బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను.
- 23 అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా
- 24 యేసు అతని చూచి ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము.
- 25 ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటె సూదిబెజ్జములో ఒంటెదూరుట సులభమని చెప్పెను.
- 26 ఇది వినినవారు ఆలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా
- 27 ఆయన మనుష్యులకు అసా ధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను.
- 28 పేతురు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబ డించితిమనగా
- 29 ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై యింటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తలిదండ్రుల నైనను పిల్లలనైనను విడిచిపెట్టినవాడెవడును,
- 30 ఇహమందు చాలరెట్లును పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను.
- 31 ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచిఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్యకుమారుని గూర్చి ప్రవక్తలచేత వ్రాయబడిన మాటలన్నియు నెర వేర్చబడును.
- 32 ఆయన అన్యజనుల కప్పగింపబడును; వారు ఆయనను అపహసించి, అవమానపరచి, ఆయనమీద ఉమి్మ వేసి,
- 33 ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు; మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను.
- 34 వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు; ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు.
- 35 ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవప్రక్కను కూర్చుండి భిక్షమడుగుకొను చుండెను.
- 36 జనసమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు వినిఇదిఏమని అడుగగా
- 37 వారునజరేయు డైన యేసు ఈ మార్గమున వెళ్లుచున్నాడని వానితో చెప్పిరి.
- 38 అప్పుడు వాడుయేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేయగా
- 39 ఊరకుండుమని ముందర నడుచుచుండినవారు వానిని గద్దించిరి గాని, వాడు మరి ఎక్కువగాదావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేసెను.
- 40 అంతట యేసు నిలిచి, వానిని తనయొద్దకు తీసికొని రమ్మనెను.
- 41 వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయననేను నీకేమి చేయ గోరుచున్నావని అడుగగా, వాడుప్రభువా, చూపు పొందగోరుచున్నా ననెను.
- 42 యేసుచూపుపొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను;
- 43 వెంటనే వాడు చూపుపొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబ డించెను. ప్రజలందరు అది చూచి దేవుని స్తోత్రము చేసిరి.
Luke 18
- Details
- Parent Category: New Testament
- Category: Luke
లూకా సువార్త చాప్టర్ 18