wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


దినవృత్తాంతములు రెండవ గ్రంథము చాప్టర్ 1
  • 1 దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడ ఉండి అతనిని బహు ఘనుడైన రాజునుగా చేసెను.
  • 2 యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోనునందుండెను గనుక
  • 3 సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇశ్రాయేలీయుల పితరుల యిండ్లకు పెద్దలైనవారి కందరికిని, అనగా ఇశ్రాయేలీయులకందరికిని ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరును
  • 4 సొలొమోనుతో కూడ కలసి గిబియోనునందుండు బలిపీఠము నొద్దకు పోయిరి; దావీదు దేవుని మందసమును కిర్యత్యారీమునుండి తెప్పించి యెరూషలేమునందు దానికొరకు గుడారమువేసి తాను సిద్ధపరచిన స్థలమున నుంచెను.
  • 5 హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన యిత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాసస్థలము ఎదుట ఉండగా సొలొమోనును సమాజపువారును దానియొద్ద విచారణ చేసిరి.
  • 6 సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధినుండి ఇత్తడి బలిపీఠము నొద్దకు సొలొమోను పోయి దానిమీద వెయ్యి దహనబలులను అర్పించెను.
  • 7 ఆ రాత్రియందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమైనేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాని అడుగుమని సెలవియ్యగా
  • 8 సొలొమోను దేవునితో ఈలాగు మనవిచేసెనునీవు నా తండ్రియైన దావీదుయెడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి యున్నావు గనుక
  • 9 దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము; నేల ధూళియంత విస్తారమైన జనులమీద నీవు నన్ను రాజుగా నియమించియున్నావు
  • 10 ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తిగలవాడెవడు? నేను ఈ జనులమధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము.
  • 11 అందుకు దేవుడు సొలొమోనుతో ఈలాగు సెలవిచ్చెనునీవు ఈ ప్రకారము యోచించు కొని, ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారిమీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి యున్నావు.
  • 12 కాబట్టి జ్ఞానమును తెలివియు నీ కియ్య బడును, నీకన్న ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను అని చెప్పెను.
  • 13 పిమ్మట సొలొమోను గిబియోనులోనుండు సమాజపు గుడారము ఎదుటనున్న బలిపీఠమును విడచి యెరూషలేమునకు వచ్చి ఇశ్రాయేలీ యులను ఏలుచుండెను.
  • 14 సొలొమోను రథములను గుఱ్ఱపు రౌతులను సమ కూర్చెను, వెయ్యిన్ని నాలుగువందలు రథములును పండ్రెండు వేల గుఱ్ఱపు రౌతులును అతనికి ఉండెను; వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణములలో ఉంచెను, కొందరిని తన రాజసన్నిధిని ఉండుటకు యెరూషలేములో ఉంచెను.
  • 15 రాజు యెరూషలేమునందు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను, సరళ మ్రానులను షెఫేల ప్రదేశముననున్న మేడిచెట్లంత విస్తారముగాను సమకూర్చెను.
  • 16 సొలొమోనునకుండు గుఱ్ఱములు ఐగుప్తులోనుండి తేబడెను, రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధర నిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి.
  • 17 ​వారు ఐగుప్తునుండి కొని తెచ్చిన రథమొకటింటికి ఆరువందల తులముల వెండియు గుఱ్ఱమొకటింటికి నూటఏబది తులముల వెండియు నిచ్చిరి; హిత్తీయుల రాజులందరికొరకును సిరియా రాజులకొరకును వారు ఆ ధరకే వాటిని తీసికొనిరి.