wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


రాజులు రెండవ గ్రంథము చాప్టర్ 13
  • 1 యూదారాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమందు యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి పదునైదు సంవత్సరములు ఏలెను.
  • 2 ఇతడు ఇశ్రాయేలువారు పాపముచేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.
  • 3 కాబట్టి యెహోవా కోపము ఇశ్రాయేలువారిమీద రగులుకొనగా ఆయన సిరియా రాజైన హజాయేలు దినములన్నిటను హజాయేలు కుమారు డైన బెన్హదదు దినములన్నిటను ఇశ్రాయేలువారిని వారి కప్పగించెను.
  • 4 ​అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజుచేత బాధనొందిన ఇశ్రాయేలువారిని కనికరించి అతని మనవి నంగీకరించెను.
  • 5 కావున యెహోవా ఇశ్రాయేలువారికి ఒక రక్షకుని అను గ్రహింపగా అతనిచేత ఇశ్రాయేలువారు సిరియనుల వశములోనుండి తప్పించుకొని మునుపటివలె స్వస్థాన ములలో కాపురముండిరి.
  • 6 అయినను ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు యరొబాము కుటుంబికులు చేసిన పాపములను వారు విడువక వాటిననుసరించుచు వచ్చిరి. మరియు ఆ దేవతాస్తంభమును షోమ్రోనులో నిలిచియుండెను.
  • 7 ​రౌతులలో ఏబదిమందియు రథములలో పదియు కాల్బలములో పదివేలమందియు మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి; మిగిలినవారిని సిరియా రాజు దుళ్లకొట్టిన ధూళివలె నాశనముచేసి యుండెను.
  • 8 యెహోయాహాజు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసినదాని నంతటినిగూర్చియు, అతని పరాక్రమ మునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథ మందు వ్రాయబడియున్నది.
  • 9 యెహోయాహాజు తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యెహోయాషు అతనికి మారుగా రాజాయెను.
  • 10 యూదారాజైన యోవాషు ఏలుబడిలో ముప్పది యేడవ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి పదునారు సంవత్సరములు ఏలెను.
  • 11 ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక వాటి ననుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.
  • 12 ​యెహోయాషు చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసినదాని అంతటినిగూర్చియు, యూదారాజైన అమజ్యాతో యుద్ధము చేయునప్పుడు అతడు కనుపరచిన పరాక్రమమునుగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
  • 13 యెహోయాషు తన పితరులతో కూడ నిద్రిం చిన తరువాత యరొబాము అతని సింహాసనముమీద ఆసీనుడాయెను; యెహోయాషు షోమ్రోనులో ఇశ్రా యేలురాజుల సమాధియందు పాతిపెట్టబడెను.
  • 14 అంతట ఎలీషా మరణకరమైన రోగముచేత పీడితుడై యుండగా ఇశ్రాయేలురాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచునా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని యేడ్చెను.
  • 15 అందుకు ఎలీషానీవు వింటిని బాణములను తీసికొమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసికొనెను.
  • 16 నీ చెయ్యి వింటిమీద ఉంచు మని అతడు ఇశ్రాయేలురాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటిమీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతులమీద వేసి
  • 17 తూర్పువైపున నున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయుమని చెప్పగా అతడు బాణము వేసెను అతడుఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలోనుండి మిమ్మును రక్షించు బాణము; సిరియనులు నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతముచేయుదువని చెప్పి,
  • 18 బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టు కొనెను. అంతట అతడు ఇశ్రాయేలురాజుతోనేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను.
  • 19 అందు నిమిత్తము దైవజనుడు అతనిమీద కోపగించినీవు అయిదు మారులైన ఆరుమారులైన కొట్టిన యెడల సిరియనులు నాశనమగువరకు నీవు వారిని హతము చేసియుందువు; అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించెదవని చెప్పెను.
  • 20 తరువాత ఎలీషా మృతిపొందగా వారు అతనిని సమా ధిలో ఉంచిరి. ఒక సంవత్సరము గడచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశముమీదికి వచ్చినప్పుడు
  • 21 కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషాయొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లు మోపి నిలిచెను.
  • 22 యెహోయాహాజు దినములన్నియు సిరియారాజైన హజాయేలు ఇశ్రాయేలువారిని బాధపెట్టెను.
  • 23 ​గాని యెహోవా వారిమీద జాలిపడి వారియందు దయయుంచి, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసియున్ననిబంధననుబట్టి వారియందు లక్ష్యము నిలిపి, వారిని నాశము చేయనొల్లక యిప్పటికిని తన సముఖములోనుండి వారిని వెళ్లగొట్టక యుండెను.
  • 24 ​సిరియారాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయెను.
  • 25 ​అంతట యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రియైన యెహోయాహాజు చేతిలోనుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరల తీసి కొనెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరల వశపరచుకొనెను.