wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


సమూయేలు రెండవ గ్రంథము చాప్టర్ 4
  • 1 హెబ్రోనులో అబ్నేరు చనిపోయెనను సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను, ఇశ్రాయేలు వారి కందరికి ఏమియు తోచకయుండెను.
  • 2 సౌలు కుమారునికి సైన్యాధిపతులుండిరి; వారిలో ఒకని పేరు బయనా, రెండవవానిపేరు రేకాబు; వీరు బెన్యామీనీయులకు చేరిన బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. బెయే రోతుకూడను బెన్యామీనీయుల దేశములో చేరినదని యెంచబడెను.
  • 3 అయితే బెయేరోతీయులు గిత్తయీమునకు పారిపోయి నేటివరకు అక్కడి కాపురస్థులైయున్నారు.
  • 4 సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలునుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానమువచ్చి నప్పుడు వాడు అయిదేండ్లవాడు; వాని దాది వానిని ఎత్తికొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయెను. వాని పేరు మెఫీబోషెతు.
  • 5 రిమ్మోను కుమారులగు రేకాబును బయనాయును మంచి యెండవేళ బయలుదేరి మధ్యాహ్నకాలమున ఇష్బోషెతు మంచముమీద పండుకొనియుండగా అతని యింటికి వచ్చిరి.
  • 6 గోధుమలు తెచ్చెదమని వేషము వేసికొని వారు ఇంటిలో చొచ్చి, ఇష్బోషెతు పడకటింట మంచము మీద పరుండియుండగా అతనిని కడుపులో పొడిచి తప్పించుకొనిపోయిరి.
  • 7 వారతని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసికొని రాత్రి అంతయు మైదాన ములో బడి ప్రయాణమైపోయి హెబ్రోనులోనున్న దావీదునొద్దకు ఇష్బోషెతు తలను తీసికొనివచ్చిచిత్త గించుము;
  • 8 ​నీ ప్రాణము తీయచూచిన సౌలుకుమారుడైన ఇష్బోషెతు తలను మేము తెచ్చియున్నాము; ఈ దినమున యెహోవా మా యేలినవాడవును రాజవునగు నీ పక్షమున సౌలుకును అతని సంతతికిని ప్రతికారము చేసి యున్నాడని చెప్పగా
  • 9 ​దావీదు బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోను బయనాతోను ఇట్లనెను
  • 10 ​మంచి వర్తమానము తెచ్చితినని తలంచియొకడు వచ్చి సౌలు చచ్చెనని నాకు తెలియజెప్పగా
  • 11 ​వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిక్లగులో నేను వానిని పట్టుకొని చంపించితిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంటిలో చొరబడి, అతని మంచము మీదనే నిర్దోషియగువానిని చంపినప్పుడు మీచేత అతని ప్రాణదోషము విచారింపక పోవుదునా? లోకములో ఉండకుండ నేను మిమ్మును తీసివేయక మానుదునా?
  • 12 ​సకలమైన ఉపద్రవములలోనుండి నన్ను రక్షించిన యెహోవా జీవముతోడు మాననని చెప్పి, దావీదు తన వారికి ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలనుదగ్గర వ్రేలాడగట్టిరి. తరువాత వారు ఇష్బోషెతు తలను తీసికొనిపోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతి పెట్టిరి.