- 1 ఇంకొకమారు యెహోవా కోపము ఇశ్రాయేలీ యులమీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణచేసినీవు పోయి ఇశ్రాయేలువారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.
- 2 అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతియైన యోవాబును పిలిచిజనసంఖ్య యెంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబావరకు ఇశ్రాయేలు గోత్ర ములలో నీవు సంచారముచేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా
- 3 యోవాబుజనుల సంఖ్య యెంత యున్నను నా యేలినవాడవును రాజవునగు నీవు బ్రదికి యుండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయునుగాక; నా యేలిన వాడవును రాజవునగు నీకు ఈ కోరిక ఏలపుట్టెననెను.
- 4 అయినను రాజు యోవా బునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చియుండుటచేత యోవాబును సైన్యాధిపతులును ఇశ్రాయేలీయుల సంఖ్య చూచుటకై రాజుసముఖమునుండి బయలు వెళ్లి
- 5 యొర్దాను నది దాటి యాజేరుతట్టున గాదు లోయ మధ్య నుండు పట్టణపు కుడిపార్శ్వముననున్న అరోయేరులో దిగి
- 6 అక్కడనుండి గిలాదునకును తహ్తింహోద్షీ దేశమునకును వచ్చిరి; తరువాత దానాయానుకును పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి.
- 7 అక్కడనుండి బురుజులుగల తూరు పట్టణ మునకును హివ్వీయులయొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములన్నిటికిని వచ్చి యూదాదేశపు దక్షిణదిక్కుననున్న బెయేర్షెబావరకు సంచరించిరి.
- 8 ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి తొమి్మదినెలల ఇరువది దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి.
- 9 అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్ప గించెను; ఇశ్రాయేలువారిలో కత్తి దూయగల యెనిమిది లక్షలమంది యోధులుండిరి; యూదా వారిలో అయిదు లక్షలమంది యుండిరి.
- 10 జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టు కొనగా అతడునేను చేసిన పనివలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాని చేసితిని; యెహోవా, కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా
- 11 ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
- 12 నీవు పోయి దావీదుతో ఇట్లనుముయెహోవా సెలవిచ్చునదేమనగా మూడు విషయములను నీ యెదుట పెట్టుచున్నాను; వాటిలో ఒక దానిని నీవు కోరుకొనిన యెడల నేనది నీమీదికి రప్పించెదను.
- 13 కావున గాదు దావీదునొద్దకు వచ్చి యిట్లని సంగతి తెలియజెప్పెనునీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల యెదుట నిలువలేక నీవు మూడు నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు మూడు దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచనచేసి నన్ను పంపినవానికి నేనియ్యవలసిన యుత్తము నిశ్చయించి తెలియజెప్పుమనెను.
- 14 అందుకు దావీదు నా కేమియు తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యతగలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండ యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనెను.
- 15 అందుకు యెహోవా ఇశ్రాయేలీయులమీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజకూటపు వేళ వరకు అది జరుగుచుండెను; అందుచేత దానునుండి బెయే ర్షెబావరకు డెబ్బది వేలమంది మృతి నొందిరి.
- 16 అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు, యెహోవా ఆ కీడునుగూర్చి సంతాపమొంది అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనముచేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను.యెహోవా దూత యెబూసీయుడైన అరౌనాయొక్క కళ్లము దగ్గర ఉండగా
- 17 దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించెనుచిత్తగించుము; పాపము చేసినవాడను నేనే; దుర్మార్గ ముగా ప్రవర్తించినవాడను నేనే; గొఱ్ఱలవంటి వీరేమి చేసిరి? నన్నును నా తండ్రి యింటివారిని శిక్షించుము.
- 18 ఆ దినమున గాదు దావీదునొద్దకు వచ్చినీవు పోయి యెబూసీయుడైన అరౌనాయొక్క కళ్లములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా
- 19 దావీదు గాదుచేత యెహోవా యిచ్చిన ఆజ్ఞచొప్పున పోయెను.
- 20 అరౌనా రాజును అతని సేవకులును తన దాపునకు వచ్చుటచూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారముచేసినా యేలినవాడవును రాజవునగు నీవు నీ దాసుడనైన నాయొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా
- 21 దావీదు ఈ తెగులు మనుష్యులకు తగలకుండ నిలిచిపోవు నట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీయొద్ద ఈ కళ్లమును కొనవలెనని వచ్చితిననెను,
- 22 అందుకు అరౌనానా యేలినవాడవగు నీవు చూచి యేది నీకు అనుకూలమో దాని తీసికొని బలి అర్పించుము; చిత్త గించుము, దహనబలికి ఎడ్లున్నవి, నూర్చుకఱ్ఱ సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును.
- 23 రాజా, యివన్నియు అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పినీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా
- 24 రాజునేను ఆలాగు తీసికొనను, వెలయిచ్చి నీయొద్ద కొందును, వెల యియ్యక నేను తీసికొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్లమును ఎడ్లను ఏబది తులముల వెండికి కొనెను.
- 25 అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను; యెహోవా దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచి పోయెను.
2 Samuel 24
- Details
- Parent Category: Old Testament
- Category: 2 Samuel
సమూయేలు రెండవ గ్రంథము చాప్టర్ 24