wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


దానియేలు చాప్టర్ 10
  • 1 పారసీకరాజగు కోరెషు పరిపాలన కాలములో మూడవ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను; గొప్ప యుద్ధము జరుగు నన్న ఆ సంగతి నిజమే; దానియేలు దాని గ్రహించెను; అది దర్శనమువలన అతనికి తెలిసిన దాయెను.
  • 2 ఆ దినముల యందు దానియేలను నేను మూడు వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని.
  • 3 మూడు వారములు గడచువరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని; మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసికొనలేదు.
  • 4 మొదటి నెల యిరువది నాలుగవతేది నేను హిద్దెకెలను గొప్ప నది తీరమున ఉంటిని.
  • 5 నేను కన్నులెత్తిచూడగా, నారబట్టలు ధరించుకొన్న యొకడు కనబడెను, అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొనియుండెను.
  • 6 అతని శరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపువలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములును పాదములును తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె ఉండెను
  • 7 దానియేలను నాకు ఈ దర్శ నము కలుగగా నాతోకూడనున్న మనుష్యులు దాని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొన వలెనని పారిపోయిరి.
  • 8 నేను ఒంటరినై యా గొప్ప దర్శ నమును చూచితిని; చూచినందున నాలో బలమేమియు లేకపోయెను, నా సొగసు వికారమాయెను, బలము నా యందు నిలువలేదు.
  • 9 నేను అతని మాటలు వింటిని; అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢనిద్ర పొందినవాడనైతిని.
  • 10 అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అఱచేతులను నేలమోపి నన్ను నిలువ బెట్టి
  • 11 ​దానియేలూ, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని; నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పుమాటలు తెలిసికొనుమనెను. అతడీమాటలు నాతో చెప్పగా నేను వణకుచు నిలువబడితిని.
  • 12 అప్పు డతడుదానియేలూ, భయ పడకుము, నీవు తెలిసికొన వలెనని నీ మనస్సును అప్పగించి, దేవుని యెదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలనుబట్టి నేను వచ్చితిని
  • 13 పారసీకుల రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములు నన్ను ఎదిరించెను. ఇంక పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను,
  • 14 ఈ దర్శనపు సంగతి ఇంక అనేకదినములవరకు జరుగదు; అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింప బోవు ఈ సంగతిని నీకు తెలియజేయ వచ్చితినని అతడు నాతో చెప్పెను.
  • 15 అతడీమాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనినైతిని.
  • 16 అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నాయెదుట నిలిచియున్న వానితో ఇట్లంటిని నా యేలినవాడా, యీ దర్శనమువలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను,
  • 17 నా యేలిన వాని దాసుడ నైన నేను నా యేలినవానియెదుట ఏలాగున మాట లాడుదును? నా బలము తొలగిపోయెను, ఊపిరి విడువలేక యున్నానని చెప్పగా
  • 18 అతడు మరల నన్ను ముట్టి నన్ను బలపరచినీవు బహు ప్రియుడవు, భయ పడకుము,
  • 19 నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకొమ్ము. ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పెను. అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యము తెచ్చుకొనినీవు నన్ను ధైర్యపరచితివి గనుక నా యేలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితిని.
  • 20 అతడునేనెందుకు నీయొద్దకు వచ్చి తినో అది నీకు తెలిసినది గదా; నేను పారసీకుడగు అధి పతితో యుద్ధముచేయుటకు మరల పోయెదను. నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశముయొక్క అధిపతి వచ్చును.
  • 21 అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ యధిపతియగు మిఖాయేలు గాక యీ సంగతులనుగూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడును లేడు.