- 1 ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని రాణియైన ఎస్తేరున కిచ్చెను ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావలెనో రాజునకు తెలియ జేసినమీదట అతడు రాజు సన్నిధికి రాగా
- 2 రాజు హామాను చేతిలోనుండి తీసికొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటిమీద అధికారిగా ఉంచెను.
- 3 మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసికొని, అతని పాదములమీద పడి, అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధ ముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా
- 4 రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి
- 5 రాజవైన తమకు సమ్మతియైనయెడలను,తమ దృష్టికి నేను దయపొందిన దాననై రాజవైన తమ యెదుట ఈ సంగతి యుక్తముగా తోచిన యెడలను, తమ దృష్టికి నేను ఇంపైన దాన నైనయెడలను, రాజవైన తమ సకల సంస్థానములలో నుండు యూదులను నాశనముచేయవలెనని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామాను వ్రాయించిన తాకీదులచొప్పున జరుగకుండునట్లు వాటిని రద్దుచేయుటకు ఆజ్ఞ ఇయ్యుడి.
- 6 నా జనులమీదికి రాబోవు కీడును, నా వంశముయొక్క నాశనమును చూచి నేను ఏలాగు సహింప గలనని మనవిచేయగా
- 7 రాజైన అహ ష్వేరోషు రాణియైన ఎస్తేరునకును యూదుడైన మొర్దెకైకిని ఈలాగు సెల విచ్చెనుహామాను ఇంటిని ఎస్తేరున కిచ్చియున్నాను; అతడు యూదులను హతముచేయుటకు ప్రయత్నించి నందున అతడు ఉరికొయ్యమీద ఉరితీయబడెను.
- 8 అయితే రాజుపేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు; కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దాని ముద్రించుడి.
- 9 సీవాను అను మూడవ నెలలో ఇరువది మూడవ దిన మందు రాజుయొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి; మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును, హిందూ దేశము మొదలుకొని కూషుదేశమువరకు వ్యాపించియున్న నూట ఇరువది యేడు సంస్థానములలోనున్న అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములకును దాని దాని వ్రాతనుబట్టియు దాని దాని భాషనుబట్టియు తాకీదులు వ్రాయబడెను.
- 10 రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుఱ్ఱములమీద, అనగా రాజనగరుపనికి పెంచ బడిన బీజాశ్వములమీద అంచెగాండ్ర నెక్కించి ఆ తాకీ దులను వారిచేత పంపెను.
- 11 రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే, అనగా అదారు అను పండ్రెండవ నెల పదమూడవ దినమందే ప్రతి పట్టణమునందుండు యూదులు కూడుకొని, తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆ యా ప్రదేశములలో నుండి తమకు విరోధులగు జనుల సైనికులనందరిని, శిశు వులను స్త్రీలను కూడ, సంహరించి హతముచేసి నిర్మూల పరచి
- 12 వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చెనని దానియందు వ్రాయబడెను.
- 13 మరియు ఈ తాకీదుకు ప్రతులు వ్రాయించి ఆ యా సంస్థానముల లోని జనులకందరికి పంపించవలెననియు,యూదులు తమ శత్రువులమీద పగతీర్చుకొనుటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలెననియు ఆజ్ఞ ఇయ్యబడెను.
- 14 రాజ నగరు పనికి పెంచబడిన బీజాశ్వములమీద నెక్కిన అంచె గాండ్రు రాజు మాటవలన ప్రేరేపింప బడి అతివేగముగా బయలుదేరిరి. ఆ తాకీదు షూషను కోటలో ఇయ్యబడెను.
- 15 అప్పుడు మొర్దెకై ఊదావర్ణమును తెలుపువర్ణ మునుగల రాజవస్త్రమును బంగారపు పెద్దకిరీటమును అవిసె నారతో చేయబడిన ధూమ్రవర్ణముగల వస్త్రములను ధరించుకొనినవాడై రాజుసముఖమునుండి బయలుదేరెను; అందునిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోష మొందెను.
- 16 మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను.
- 17 రాజుచేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోష మును కలిగెను, అది శుభదినమని విందుచేసికొనిరి. మరియు దేశజనులలో యూదులయెడల భయముకలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి.
Esther 08
- Details
- Parent Category: Old Testament
- Category: Esther
ఎస్తేరు చాప్టర్ 8