- 1 మరియు నరపుత్రుడా, నీవు మంగలకత్తివంటి వాడిగల కత్తియొకటి తీసికొని నీ తలను గడ్డమును క్షౌరముచేసికొని, త్రాసు తీసికొని ఆ వెండ్రుకలను తూచి భాగములు చేయుము.
- 2 పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి మూడవ భాగమును కాల్చి, రెండవ భాగమును తీసి ఖడ్గముచేత హతముచేయు రీతిగా దానిని చుట్టు విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము; నేను ఖడ్గముదూసి వాటిని తరుముదును.
- 3 అయితే వాటిలో కొన్నిటిని తీసికొని నీ చెంగున కట్టుకొనుము;
- 4 పిమ్మట వాటిలో కొన్నిటిని మరల తీసి అగ్నిలోవేసి కాల్చుము; దానినుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారినందరిని తగులబెట్టును.
- 5 మరియు ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చెను ఇది యెరూషలేమే గదా, అన్యజనులమధ్య నేను దాని నుంచితిని, దానిచుట్టు రాజ్యములున్నవి.
- 6 అయితే వారు నా విధులను తృణీకరించి, నా కట్టడల ననుసరింపక దుర్మార్గత ననుసరించుచు, నా విధులను కట్టడలను త్రోసి వేసి తమ చుట్టునున్న అన్యజనుల కంటెను దేశస్థులకంటెను మరి యధికముగా దుర్మార్గులైరి
- 7 కాబట్టి ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునా కట్టడల ననుసరింపకయు నా విధులను గైకొనకయు నుండువారై, మీ చుట్టునున్న అన్యజనులకు కలిగియున్న విధులనైనను అనుసరింపక, మీరు మీ చుట్టునున్న దేశస్థులకంటె మరి యధికముగా కఠినహృదయులైతిరి.
- 8 కావున ప్రభువైన యెహోవానగు నేను నీకు విరోధినైతిని, అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును.
- 9 నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయనికార్యమును, ఇక మీదట నేను చేయబూనుకొనని కార్యమును నీ మధ్య జరిగింతును.
- 10 కావున నీ మధ్య తండ్రులు తమ కుమారు లను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు, ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశల చెదరగొట్టుదును.
- 11 నీ హేయదేవత లన్నిటిని పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధస్థలమును అపవిత్ర పరచితివి గనుక కరుణా దృష్టియైనను జాలియైనను లేక నేను నిన్ను క్షీణింప జేసెదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు
- 12 కరవు వచ్చి యుండగా నీలో మూడవ భాగము తెగులుచేత మరణ మవును, మూడవ భాగము ఖడ్గముచేత నీ చుట్టు కూలును, నేను కత్తి దూసిి మిగిలిన భాగమును నలుదిశల చెదరగొట్టి తరుముదును.
- 13 నా కోపము తీరును, వారిమీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును, నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొనుకాలమున యెహోవానైన నేను ఆసక్తిగలవాడనై ఆలాగు సెలవిచ్చితినని వారు తెలిసి కొందురు
- 14 ఆలాగు నీ చుట్టునున్న అన్యజనులలో నిన్ను చూచు వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును.
- 15 కావున నీ పోషణాధారము తీసివేసి, నీమీదికి నేను మహా క్షామము రప్పించి, నీవారు క్షయమగునట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును పంపించి, కోపముచేతను క్రోధముచేతను కఠినమైన గద్దిం పులచేతను నేను నిన్ను శిక్షింపగా
- 16 నీ చుట్టునున్న అన్య జనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయ మునకును ఆస్పదముగా ఉందువు; యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చియున్నాను.
- 17 ఈ ప్రకారము నేను నీమీదికి క్షామమును దుష్టమృగములను పంపుదును, అవి నీకు పుత్ర హీనత కలుగజేయును, తెగులును ప్రాణహానియు నీకు కలుగును, మరియు నీమీదికి ఖడ్గమును రప్పించెదను; యెహోవానగు నేనే యీలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను.
Ezekiel 05
- Details
- Parent Category: Old Testament
- Category: Ezekiel
యెహెజ్కేలు చాప్టర్ 5