- 1 బాకా నీ నోటను ఉంచి ఊదుము, జనులు నా నిబంధన నతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరియున్నారు గనుక పక్షిరాజు వ్రాలినట్టు శత్రువు యెహోవా మందిర మునకు వచ్చునని ప్రకటింపుము.
- 2 వారుమా దేవా, ఇశ్రాయేలువారలమైన మేము నిన్ను ఎరిగియున్న వారమే యని నాకు మొఱ్ఱపెట్టుదురు;
- 3 ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును.
- 4 నాకు అనుకూలులుకాని రాజులను వారు నియమించుకొని యున్నారు, నేనెరుగని అధిపతులను తమకుంచుకొని యున్నారు, విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగార ములను వినియోగించుటచేత వాటిని పోగొట్టుకొని యున్నారు.
- 5 షోమ్రోనూ, ఆయన నీ దూడను (విగ్ర హము) విసర్జించెను నా కోపము వారిమీదికి రగులు కొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాల కుందురు?
- 6 అది ఇశ్రాయేలువారి చేతి పనియే గదా? కంసాలి దానిని చేసెను, అది దైవము కాదు గదా; షోమ్రోను చేసికొనిన యీ దూడ ఛిన్నాభిన్నములగును.
- 7 వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును; విత్తినది పైరుకాదు, మొలక కాదు, పంట యెత్తినది అది పంటకు వచ్చినయెడల అన్యులు దాని తినివేతురు.
- 8 ఇశ్రాయేలువారు తినివేయబడుదురు; ఎవరికిని ఇష్టముకాని ఘటమువంటివారై అన్యజనులలో నుందురు.
- 9 అడవి గార్దభము తన ఆశ తీర్చుకొనబోయి నట్లు ఇశ్రాయేలు వారు అష్షూరీయులయొద్దకు పోయిరి; ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటకాండ్రను పిలుచు కొనెను.
- 10 వారు కానుకలు ఇచ్చి అన్యజనులలో విట కాండ్రను పిలుచుకొనినను ఇప్పుడే నేను వారిని సమ కూర్చుదును; అధిపతులుగల రాజు పెట్టు భారముచేత వారు త్వరలో తగ్గిపోవుదురు.
- 11 ఎఫ్రాయిము పాపము నకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను, అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయెను.
- 12 నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను.
- 13 నా కర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు; అట్టి బలులయందు యెహోవాకు ఇష్టము లేదు, త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములనుబట్టి వారిని శిక్షించును; వారు మరల ఐగుప్తునకు వెళ్లవలసి వచ్చెను.
- 14 ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచియున్నారు; యూదావారు ప్రాకారములుగల పట్టణములను చాల కట్టియున్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగులబెట్టెదను, అది వాటి నగరులను కాల్చివేయును.
Hosea 08
- Details
- Parent Category: Old Testament
- Category: Hosea
హొషేయ చాప్టర్ 8