- 1 ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెష యాకు కలిగిన దర్శనము.
- 2 యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.
- 3 ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు
- 4 పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకుశ్రమ. వారు యెహోవాను విసర్జించి యున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు.
- 5 నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను.
- 6 అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు.
- 7 మీ దేశము పాడైపోయెను మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయెను మీ యెదుటనే అన్యులు మీ భూమిని తినివేయు చున్నారు అన్యులకు తటస్థించు నాశనమువలె అది పాడైపోయెను.
- 8 ద్రాక్షతోటలోని గుడిసెవలెను దోసపాదులలోని పాకవలెను ముట్టడి వేయబడిన పట్టణమువలెను సీయోను కుమార్తె విడువబడియున్నది.
- 9 సైన్యములకధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని యెడల మనము సొదొమవలె నుందుము గొమొఱ్ఱాతో సమాన ముగా ఉందుము.
- 10 సొదొమ న్యాయాధిపతులారా, యెహోవామాట ఆల కించుడి. గొమొఱ్ఱా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవి యొగ్గుడి.
- 11 యెహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పాట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కస మాయెను కోడెల రక్తమందైనను గొఱ్ఱపిల్లల రక్తమందైనను మేక పోతుల రక్తమందైనను నాకిష్టములేదు.
- 12 నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు?
- 13 మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రక టనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చ జాలను.
- 14 మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలము లును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను.
- 15 మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.
- 16 మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొల గింపుడి.
- 17 కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్ష ముగా వాదించుడి.
- 18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱబొచ్చువలె తెల్లని వగును.
- 19 మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి యొక్క మంచిపదార్థములను అనుభవింతురు.
- 20 సమ్మతింపక తిరుగబడినయెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు యెహోవా యీలాగుననే సెలవిచ్చియున్నాడు.
- 21 అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయెనే! అది న్యాయముతో నిండియుండెను నీతి దానిలో నివసించెను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు.
- 22 నీ వెండి మష్టాయెను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయెను.
- 23 నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరు లంచము కోరుదురు బహుమానములకొరకు కనిపెట్టుదురు తండ్రిలేనివారిపక్షమున న్యాయము తీర్చరు, విధవ రాండ్ర వ్యాజ్యెము విచారించరు.
- 24 కావున ప్రభువును ఇశ్రాయేలుయొక్క బలిష్ఠుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగున అనుకొనుచున్నాడు ఆహా, నా శత్రువులనుగూర్చి నేనికను ఆయాసపడను నా విరోధులమీద నేను పగ తీర్చుకొందును.
- 25 నా హస్తము నీమీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసి వేసెదను.
- 26 మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను ఆదిలోనుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియ మించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును.
- 27 సీయోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిచేతను విమోచనము కలుగును.
- 28 అతిక్రమము చేయువారును పాపులును నిశ్శేషముగా నాశనమగుదురు యెహోవాను విసర్జించువారు లయమగుదురు.
- 29 మీరు ఇచ్ఛయించిన మస్తకివృక్షమునుగూర్చి వారు సిగ్గుపడుదురు మీకు సంతోషకరములైన తోటలనుగూర్చి మీ ముఖ ములు ఎఱ్ఱబారును
- 30 మీరు ఆకులు వాడు మస్తకివృక్షమువలెను నీరులేని తోటవలెను అగుదురు.
- 31 బలవంతులు నారపీచువలె నుందురు, వారి పని అగ్ని కణమువలె నుండును ఆర్పువాడెవడును లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును.
Isaiah 01
- Details
- Parent Category: Old Testament
- Category: Isaiah
యెషయా గ్రంథము చాప్టర్ 1