- 1 ఆలకించుడి ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు
- 2 శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను
- 3 సోదెకాండ్రను పెద్దలను పంచాదశాధిపతులను ఘనత వహించినవారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎరిగినవారిని మాంత్రికులను యెరూషలేములోనుండియు యూదాదేశములో నుండియు తీసివేయును.
- 4 బాలకులను వారికి అధిపతులనుగా నియమించెదను వారు బాలచేష్టలుచేసి జనులను ఏలెదరు.
- 5 ప్రజలలో ఒకడిట్లును మరియొకడట్లును ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తుడు చేయును. పెద్దవానిపైని బాలుడును ఘనునిపైని నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును.
- 6 ఒకడు తన తండ్రియింట తన సహోదరుని పట్టుకొని నీకు వస్త్రము కలదు నీవు మామీద అధిపతివై యుందువు ఈ పాడుస్థలము నీ వశముండనిమ్మనును
- 7 అతడు ఆ దినమున కేకవేసినేను సంరక్షణ కర్తనుగా ఉండనొల్లను నాయింట ఆహారమేమియు లేదు వస్త్రమేమియు లేదు నన్ను జనాధిపతిగా నియమింపరాదనును.
- 8 యెరూషలేము పాడైపోయెను యూదా నాశన మాయెను యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయు నంతగా వారి మాటలును క్రియలును ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి.
- 9 వారి ముఖలక్షణమే వారిమీద సాక్ష్యమిచ్చును. తమ పాపమును మరుగుచేయక సొదొమవారివలె దాని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడుచేసికొని యున్నారు వారికి శ్రమ
- 10 మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు.
- 11 దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును.
- 12 నా ప్రజలవిషయమై నేనేమందును? బాలురు వారిని బాధపెట్టుచున్నారు స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించు వారు
- 13 వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. యెహోవా వాదించుటకు నిలువబడియున్నాడు జనములను విమర్శించుటకు లేచియున్నాడు
- 14 యెహోవా తన జనుల పెద్దలను వారి యధిపతులను విమర్శింప వచ్చుచున్నాడు. మీరే ద్రాక్షలతోటను తినివేసితిరి మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ యిండ్లలోనే యున్నది
- 15 నా ప్రజలను నలుగగొట్టి మీరేమి చేయుదురు? బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు? అని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- 16 మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించు చున్నారు;
- 17 కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును యెహోవా వారి మానమును బయలుపరచును.
- 18 ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను
- 19 కర్ణభూషణములను కడియములను నాణమైన ముసుకు లను
- 20 కుల్లాయీలను కాళ్ల గొలుసులను ఒడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరిణలను
- 21 రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను
- 22 ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను
- 23 చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుకులను పాగాలను శాలువులను తీసివేయును.
- 24 అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా త్రాడును అల్లిన జడకు ప్రతిగా బోడితలయు ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు అందమునకు ప్రతిగా వాతయును ఉండును.
- 25 ఖడ్గముచేత మనుష్యులు కూలుదురు యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు
- 26 పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును ఆమె ఏమియు లేనిదై నేల కూర్చుండును.
Isaiah 03
- Details
- Parent Category: Old Testament
- Category: Isaiah
యెషయా గ్రంథము చాప్టర్ 3