wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


యెషయా గ్రంథము చాప్టర్ 44
  • 1 అయినను నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలూ, వినుము
  • 2 నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము.
  • 3 నేను దప్పిగలవానిమీద నీళ్లను ఎండిన భూమిమీద ప్రవాహజలములను కుమ్మరించెదను నీ సంతతిమీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను.
  • 4 నీటికాలువలయొద్ద నాటబడిన నిరవంజిచెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు.
  • 5 ఒకడునేను యెహోవావాడననును, మరియొకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరియొకడు యెహోవావాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలను మారుపేరు పెట్టుకొనును.
  • 6 ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు.
  • 7 ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అట్టివాడెక్కడైన నుండినయెడల నాకు తెలియజెప్ప వలెను ఆ సంగతి నాకు ప్రచురింపవలెను అట్టివారు భవిష్యద్విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పువారై యుండవలెను.
  • 8 మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలమునుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవు డున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు, ఉన్నట్టు నే నెరుగను.
  • 9 విగ్రహమును నిర్మించువారందరు మాయవంటివారు వారికిష్టమైన విగ్రహములు నిష్‌ప్రయోజనములు తామే అందుకు సాక్షులు, వారు గ్రహించువారు కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు.
  • 10 ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దాని నొక దేవునిగా నిరూపించువాడెవడు?
  • 11 ఇదిగో దాని పూజించువారందరు సిగ్గుపడుదురు ఆ శిల్పకారులు నరమాత్రులేగదా? వారందరు పోగు చేయబడి నిలువబడవలెను నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు.
  • 12 కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును సుత్తెతో దానిని రూపించి తన బాహుబలముచేత దాని చేయును. అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును నీళ్లు త్రాగక సొమ్మసిల్లును
  • 13 వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీచి చిత్రిక లతో దాని చక్కచేయును కర్కాటకములతో గురుతుపెట్టి దాని రూపించును మందిరములో దాని స్థాపింపవలెనని నరరూపముగల దానిగాను నరసౌందర్యముగలదానిగాను చేయును.
  • 14 ఒకడు దేవదారుచెట్లను నరుకవలెనని పూనుకొనును శ్మశానావృక్షమును గాని సరళవృక్షమును గాని సింధూరవృక్షములనుగాని అడవి వృక్షములలో ఏదో ఒకదానిని తీసికొనును ఒకడు చెట్టు నాటగా వర్షము దాని పెంచును
  • 15 ఒకడు పొయ్యికట్టెలకు వాటి నుపయోగించును వాటిలో కొంతతీసికొని చలి కాచుకొనును నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును ఒక తుండు తీసికొని దానితో ఒక దేవతను చేసికొనును దానికి నమస్కారము చేయును దానితో ఒక విగ్రహముచేసి దానికి సాగిలపడును.
  • 16 అగ్నితో సగము కాల్చియున్నాడు, కొదువ సగ ముతో మాంసము వండి భక్షించియున్నాడు తిని తృప్తిపొందగా చలి కాచుకొనుచు ఆహా, చలికాచుకొంటిని వెచ్చగా ఉన్నది అని అను కొనుచున్నాడు
  • 17 దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును దానియెదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు నీవే నా దేవుడవు నన్ను రక్షింపుమని ప్రార్థించును.
  • 18 వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయ బడెను.
  • 19 ఎవడును ఆలోచనచేయడు, నేను అగ్నిలో సగము కాల్చితిని నిప్పులమీద వేసి రొట్టె కాల్చితిని దానితో మాంసము వండుకొని భోజనము చేసితిని మిగిలినదానిని తీసికొని దానితో హేయమైనదాని చేయుదునా? చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా? అని యెవడును ఆలోచింపడు యోచించుటకు ఎవనికిని తెలివిలేదు వివేచనలేదు.
  • 20 వాడు బూడిదె తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసికొనిపోవు చున్నది వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు నా కుడిచేతిలో అబద్ధమున్నది గదా అనియు అను కొనుటకు వానికి బుద్ధి చాలదు.
  • 21 యాకోబూ, ఇశ్రాయేలూ; వీటిని జ్ఞాపకము చేసికొనుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించితిని ఇశ్రాయేలూ, నీవు నాకు సేవకుడవై యున్నావు నేను నిన్ను మరచిపోజాలను.
  • 22 మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి యున్నాను నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు మళ్లుకొనుము.
  • 23 యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి.యెహోవా యాకోబును విమోచించునుఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్నతునిగా కనుపరచుకొనును
  • 24 గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను
  • 25 నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయు వాడను సోదెకాండ్రను వెఱ్ఱివారినిగా చేయువాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే.
  • 26 నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను యెరూషలేము నివాసస్థలమగుననియు యూదా నగరులనుగూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను, దాని పాడైన స్థలములను బాగుచేయువాడను నేనే.
  • 27 నేనే నీ నదులను ఎండచేయుచున్నాను ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను
  • 28 కోరెషుతో నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతోనీవు కట్టబడుదువనియు దేవాలయ మునకు పునాదివేయబడుననియు నేను చెప్పు చున్నాను.