wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


యిర్మీయా చాప్టర్ 3
  • 1 మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతనియొద్దనుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమెయొద్దకు తిరిగిచేరునా? ఆలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును గదా; అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నాయొద్దకు తిరిగిరమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
  • 2 చెట్లులేని కొండప్రదేశమువైపు నీ కన్నులెత్తి చూడుము; నీతో ఒకడు శయనింపని స్థలమెక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబిదేశస్థుడు కాచియుండునట్లుగా నీవు వారికొరకు త్రోవలలో కూర్చుండియున్నావు; నీ వ్యభి చారములచేతను నీ దుష్కార్యములచేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు.
  • 3 కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి యున్నది, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యమువంటి ధైర్యము గలదు, సిగ్గు పడనొల్ల కున్నావు.
  • 4 ​అయినను ఇప్పుడు నీవునా తండ్రీ, చిన్నప్పటినుండి నాకు చెలికాడవు నీవే యని నాకు మొఱ్ఱపెట్టుచుండవా?
  • 5 ఆయన నిత్యము కోపించునా? నిరంతరము కోపము చూపునా? అని నీవనుకొనినను నీవు చేయదలచిన దుష్కార్యములు చేయుచునే యున్నావు.
  • 6 మరియు రాజైన యోషీయా దినములలో యెహోవా నాకీలాగు సెలవిచ్చెనుద్రోహినియగు ఇశ్రాయేలు చేయుకార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండమీదికిని పచ్చని ప్రతి చెట్టు క్రిందికిని పోవుచు అక్కడ వ్యభిచారము చేయుచున్నది.
  • 7 ఆమె యీ క్రియలన్నిటిని చేసినను, ఆమెను నాయొద్దకు తిరిగి రమ్మని నేను సెలవియ్యగా ఆమె తిరిగిరాలేదు. మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరియైన యూదా దాని చూచెను.
  • 8 ద్రోహినియగు ఇశ్రాయేలు వ్యభి చారముచేసిన హేతువుచేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగపత్రిక ఇయ్యగా, విశ్వాసఘాతకు రాలగు ఆమె సహోదరియైన యూదా చూచియు తానును భయపడక వ్యభిచారము చేయుచు వచ్చు చున్నది.
  • 9 రాళ్లతోను మొద్దులతోను వ్యభిచారము చేసెను; ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరచెను.
  • 10 ఇంతగా జరిగినను విశ్వాసఘాతకు రాలగు ఆమె సహోదరియైన యూదా పైవేషమునకే గాని తన పూర్ణహృదయముతో నాయొద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
  • 11 కాగా విశ్వాసఘాతకురాలగు యూదాకంటె ద్రోహినియగు ఇశ్రాయేలు తాను నిర్దోషినియని ఋజువుపరచుకొని యున్నది.
  • 12 నీవు వెళ్లి ఉత్తరదిక్కున ఈ మాటలు ప్రక టింపుముద్రోహినివగు ఇశ్రాయేలూ, తిరిగిరమ్ము; ఇదే యెహోవా వాక్కు. మీమీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడు కోపించువాడను కాను; ఇదే యెహోవా వాక్కు.
  • 13 నీ దేవుడైన యెహోవామీద తిరుగుబాటు చేయుచు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము; ఇదే యెహోవా వాక్కు.
  • 14 భ్రష్టులగు పిల్లలారా, తిరిగిరండి, నేను మీ యజమానుడను; ఇదే యెహోవా వాక్కు ఒకానొక పట్టణములోనుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములోనుండి ఇద్దరినిగాను మిమ్మును తీసికొని సీయోనునకు రప్పించెదను.
  • 15 నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము నేలుదురు.
  • 16 ​మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులుయెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు, అది వారి మనస్సు లోనికి రాదు, దానిని జ్ఞాపకము చేసికొనరు, అది పోయి నందుకు చింతపడరు, ఇకమీదట దాని చేయరాదు; ఇదే యెహోవా వాక్కు.
  • 17 ఆ కాలమునయెహోవాయొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు; జనము లన్నియు తమ దుష్టమనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమునుబట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు.
  • 18 ఆ దిన ములలో యూదావంశస్థులును ఇశ్రాయేలు వంశస్థులును కలిసి ఉత్తరదేశములోనుండి ప్రయాణమై, మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు.
  • 19 ​నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని, రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకిచ్చెద ననుకొని యుంటిని. నీవునా తండ్రీ అని నాకు మొఱ్ఱపెట్టి నన్ను మానవనుకొంటిని గదా?
  • 20 అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాస ఘాతకులైతిరి; ఇదే యెహోవా వాక్కు.
  • 21 ఆలకించుడి, చెట్లులేని మెట్టలమీద ఒక స్వరము వినబడుచున్నది; ఆలకించుడి, తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహో వాను మరచినదానిని బట్టి ఇశ్రాయేలీయులు చేయు రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి.
  • 22 భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి;మీ అవిశ్వాసమును నేను బాగుచేసెదను; నీవే మాదేవుడ వైనయెహోవావు, నీయొద్దకే మేము వచ్చు చున్నాము,
  • 23 ​నిశ్చయముగా కొండలమీద జరిగినది మోస కరము, పర్వతములమీద చేసిన ఘోష నిష్‌ప్రయోజనము, నిశ్చయముగా మా దేవుడైన యెహోవావలన ఇశ్రాయేలు నకు రక్షణ కలుగును.
  • 24 అయినను మా బాల్యమునుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొఱ్ఱలను వారి పశువులను వారి కుమారులను వారి కుమార్తెలను మింగివేయుచున్నది.
  • 25 సిగ్గునొందినవారమై సాగిలపడుదము రండి, మనము కనబడకుండ అవమానము మనలను మరుగుచేయును గాక; మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులును మన బాల్యమునుండి నేటివరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసినవారము.