- 1 యెహోవా వాక్కు ఇదేనా మందలో చేరిన... గొఱ్ఱలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ.
- 2 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులనుగూర్చి యీలాగున సెలవిచ్చుచున్నాడు మీరు నా గొఱ్ఱలనుగూర్చి విచారణచేయక, నేను మేపుచున్న గొఱ్ఱలను చెదరగొట్టి పారదోలితిరి; ఇదిగో మీ దుష్‌క్రియలనుబట్టి మిమ్మును శిక్షింపబోవుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.
- 3 మరియు నేను వాటిని తోలి వేసిన దేశములన్నిటిలోనుండి నా గొఱ్ఱల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను; అవి అభి వృద్ధిపొంది విస్తరించును.
- 4 నేను వాటి మీద కాపరులను నియమించెదను; ఇకమీదట అవి భయపడకుండను బెదరి పోకుండను వాటిలో ఒకటైనను తప్పిపోకుండను వీరు నా గొఱ్ఱలను మేపెదరు; ఇదే యెహోవా వాక్కు.
- 5 యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడురాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.
- 6 అతని దినములలో యూదా రక్షణనొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు.
- 7 కాబట్టి రాబోవు దినములలో జనులు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోనుండి రప్పించిన యెహోవా జీవము తోడని యిక ప్రమాణముచేయక
- 8 ఉత్తర దేశములో నుండియు, నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండియు వారిని రప్పించిన యెహోవానగు నాతోడని ప్రమాణము చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు; మరియు వారు తమ దేశములో నివసింతురు.
- 9 ప్రవక్తలను గూర్చినది. యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది, నా యెముకలన్నియు కదలు చున్నవి, నేను మత్తిల్లినవానివలెను ద్రాక్షారసవశుడైన బలాఢ్యునివలెను ఉన్నాను.
- 10 దేశము వ్యభిచారులతో నిండియున్నది, జనుల నడవడి చెడ్డదాయెను, వారి శౌర్యము అన్యాయమున కుపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది; అడవిబీళ్లు ఎండిపోయెను.
- 11 ప్రవక్తలేమి యాజకులేమి అందరును అపవిత్రులు; నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను; ఇదే యెహోవా వాక్కు.
- 12 వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను గనుక గాఢాంధకార ములో నడుచువానికి జారుడు నేలవలె వారి మార్గ ముండును; దానిలో వారు తరుమబడి పడిపోయెదరు; ఇదే యెహోవా వాక్కు.
- 13 షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని; వారు బయలు పేరట ప్రవచనము చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి.
- 14 యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు అసత్య వర్తనులు, ఎవడును తన దుర్మార్గతనుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు, వారందరు నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొఱ్ఱావలెనైరి.
- 15 కావున సైన్యములకధిపతియగు యెహోవా ఈ ప్రవక్త లనుగూర్చి సెలవిచ్చునదేమనగాయెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతట వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదునీళ్లును నేను వారి కిచ్చు చున్నాను.
- 16 సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమీకు ప్రచనములు ప్రకటించు ప్రవక్తలమాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు.
- 17 వారు నన్ను తృణీకరించు వారితోమీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు; ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితోమీకు కీడు రాదనియు చెప్పుచు, యెహోవా ఆజ్ఞనుబట్టి మాట లాడక తమకు తోచిన దర్శనమునుబట్టి పలుకుదురు.
- 18 యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించునట్లు దాని లక్ష్యము చేసినవాడెవడు?
- 19 ఇదిగో యెహోవాయొక్క మహోగ్రతయను పెనుగాలి బయలువెళ్లుచున్నది; అది భీకరమైన పెనుగాలి అది దుష్టుల తలమీదికి పెళ్లున దిగును.
- 20 తన కార్యమును సఫలపరచువరకును తన హృదయా లోచనలను నెరవేర్చువరకును యెహోవా కోపము చల్లారదు; అంత్యదినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు.
- 21 నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చెదరు, నేను వారితో మాటలాడకుండినను వారు ప్రకటించెదరు.
- 22 వారు నా సభలో చేరిన వారైన యెడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియ జేతురు, దుష్‌క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచి పెట్టునట్లు వారిని త్రిప్పియుందురు; ఇదే యెహోవా వాక్కు.
- 23 నేను సమీపముననుండు దేవుడనుమాత్ర మేనా? దూరముననుండు దేవుడనుకానా?
- 24 యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైనకలడా? నేను భూమ్యా కాశముల యందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు.
- 25 కలకంటిని కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను.
- 26 ఇక నెప్పటివరకు ఈలాగున జరుగుచుండును? తమ హృదయకాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీని నాలో చింపరా?
- 27 బయలును పూజింపవలెనని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరు తమ పొరుగువారితో చెప్పు కలలచేత నా జనులు నా నామమును మరచునట్లు చేయవలెనని యోచించుచున్నారా?
- 28 కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను; నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమునుబట్టి నా మాట చెప్పవలెను; ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు.
- 29 నా మాట అగ్నివంటిదికాదా? బండను బద్దలుచేయు సుత్తెవంటిది కాదా?
- 30 కాబట్టి తమ జతవానియొద్దనుండి నా మాటలను దొంగి లించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు.
- 31 స్వేచ్ఛగా నాలుకల నాడించుకొనుచు దేవో క్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు.
- 32 మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు, అబద్ధములచేతను, మాయాప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించువారికి నేను విరో ధినై యున్నాను; ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు; ఇదే యెహోవా వాక్కు.
- 33 మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్నడుగునప్పుడు నీవు వారితో ఇట్లనుముమీరే ఆయనకు భారము; మిమ్మును ఎత్తి పారవేతును; ఇదే యెహోవా వాక్కు. మరియు
- 34 ప్రవక్తయే గాని యాజ కుడే గాని సామాన్యుడే గాని యెహోవా భారమను మాట ఎత్తువాడెవడైనను, వానిని వాని యింటివారిని నేను దండించెదను.
- 35 అయితే యెహోవా ప్రత్యుత్తరమేది? యెహోవా యేమని చెప్పుచున్నాడు? అని మీరు మీ పొరుగువారితోను సహోదరులతోను ప్రశంసించవలెను.
- 36 యెహోవా భారమను మాట మీరిక మీదట జ్ఞాపకము చేసికొనవద్దు; జీవముగల మన దేవుని మాటలను, సైన్యముల కధిపతియు దేవుడునగు యెహోవా మాటలను, మీరు అపార్థముచేసితిరి; కాగా ఎవనిమాట వానికే భారమగును.
- 37 యెహోవా నీకేమని ప్రత్యుత్తర మిచ్చుచున్నా డనియు, యెహోవా యేమి చెప్పుచున్నాడనియు మీరు ప్రవక్తను అడుగవలెను గాని యెహోవా భారమను మాట మీరెత్తిన యెడల
- 38 అందునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమీరు యెహోవా భారమను మాట యెత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు యెహోవా భారమను మాట యెత్తుచునే యున్నారు.
- 39 కాగా నేను మిమ్మును ఎత్తివేయుచున్నాను, మీకును మీ పితరులకును నేనిచ్చిన పట్టణమును నా సన్నిధినుండి పారవేయుచున్నాను.
- 40 ఎన్నడును మరువబడని నిత్యాపవాదమును నిత్యావమానమును మీమీదికి రప్పిం చెదను.
Jeremiah 23
- Details
- Parent Category: Old Testament
- Category: Jeremiah
యిర్మీయా చాప్టర్ 23