- 1 దీనినిబట్టి నా హృదయము వణకుచున్నదిదాని స్థలములోనుండి అది కదలింపబడుచున్నది.
- 2 ఆయన స్వరగర్జనమును వినుడి ఆయన నోటనుండి బయలువెళ్లు ధ్వని నాలకించుడి.
- 3 ఆకాశవైశాల్యమంతటి క్రింద ఆయనదాని వినిపించును భూమ్యంతములవరకు తన మెరుపును కనబడజేయును.
- 4 దాని తరువాత ఉరుముధ్వని గర్జించును ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును ఆయన ధ్వని వినబడునప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు
- 5 దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును మనము గ్రహింపలేని గొప్పకార్యములను ఆయన చేయును.
- 6 నీవు భూమిమీద పడుమని హిమముతోను వర్షముతోను మహా వర్షముతోను ఆయన ఆజ్ఞ ఇచ్చు చున్నాడు.
- 7 మనుష్యులందరు ఆయన సృష్టికార్యమును తెలిసికొను నట్లు ప్రతి మనుష్యుని చేతినిబిగించి ఆయన ముద్రవేసి యున్నాడు.
- 8 జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి వాటి బిలములలో వసించును.
- 9 మరుగుస్థానములోనుండి తుఫాను వచ్చును ఉత్తరదిక్కునుండి చలి వచ్చును
- 10 దేవుని ఊపిరివలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును.
- 11 మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును.
- 12 ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్య మైన భూగోళము మీద మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెర వేర్చును
- 13 శిక్షకొరకే గాని తన భూలోకముకొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించినదానిని అవి నెరవేర్చును.
- 14 యోబూ, ఈ మాట ఆలకింపుము ఊరకుండి దేవుని అద్భుతక్రియలను ఆలోచింపుము.
- 15 దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని యెట్లు తీర్మానముచేయునో నీకు తెలియునా?
- 16 మేఘములను తేలచేయుటయు పరిపూర్ణజ్ఞానము గలవాని మహా కార్యములును నీకు తెలియునా?
- 17 దక్షిణపుగాలి వీచుటచేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియునా?
- 18 పోతపోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా?
- 19 మేము ఆయనతో ఏమి పలుకవలెనో అది మాకు తెలుపుము. చీకటి కలిగినందున మాకేమియు తోచక యున్నది
- 20 నేను పలుకుదునని యెవడైన ఆయనతో చెప్పదగునా? ఒకడు తాను నిర్మూలము కావలెనని కోరునా?
- 21 ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ యిప్పుడు కనబడకయున్నను గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కను పరచును.
- 22 ఉత్తరదిక్కున సువర్ణప్రకాశము పుట్టును దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని యున్నాడు.
- 23 సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యముగలవాడు. ఆయన మనకు అగోచరుడు.న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయనయందు భయభక్తులు కలిగి యుందురు.
- 24 తాము జ్ఞానులమనుకొనువారిని ఆయన ఏమాత్రమును లక్ష్యపెట్టడు.
Job 37
- Details
- Parent Category: Old Testament
- Category: Job
యోబు గ్రంథము చాప్టర్ 37