wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


యోబు గ్రంథము చాప్టర్ 39
  • 1 అడవిలోని కొండమేకలు ఈనుకాలము నీకు తెలియునా? లేళ్లు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా?
  • 2 అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా? అవి యీనుకాలము ఎరుగుదువా?
  • 3 అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును.
  • 4 వాటి పిల్లలు పుష్టికలిగి యెడారిలో పెరుగును అవి తల్లులను విడిచిపోయి వాటియొద్దకు తిరిగి రావు.
  • 5 అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడెవడు? అడవిగాడిద కట్లను విప్పినవాడెవడు?
  • 6 నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పుపఱ్ఱను దానికి నివాసస్థలముగాను నియమించితిని.
  • 7 పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు.
  • 8 పర్వతముల పంక్తియే దానికి మేతభూమి ప్రతివిధమైన పచ్చని మొలకను అది వెదకుకొనును.
  • 9 గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ శాలలో నిలుచునా?
  • 10 పగ్గము వేసి గురుపోతును నాగటిచాలులో కట్ట గలవా? అది నీచేత తోలబడి లోయలను చదరము చేయునా?
  • 11 దాని బలము గొప్పదని దాని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించెదవా?
  • 12 అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్లమందున్న ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా?
  • 13 నిప్పుకోడి సంతోషముచేత రెక్కల నాడించును. రెక్కలును వెండ్రుకలును దాని కున్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా?
  • 14 లేదుసుమీ, అది నేలను దాని గుడ్లను పెట్టును ధూళిలో వాటిని కాచును.
  • 15 దేనిపాదమైన వాటిని త్రొక్క వచ్చుననియైనను అడవిజంతువు వాటిని చితక ద్రొక్కవచ్చుననియైనను అనుకొనకయే యున్నది.
  • 16 తన పిల్లలు తనవికానట్టు వాటియెడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు
  • 17 దేవుడు దానిని తెలివిలేనిదిగా జేసెను ఆయన దానికి వివేచనాశక్తి ననుగ్రహించి యుండ లేదు.
  • 18 అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్క రించును.
  • 19 గుఱ్ఱమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా?
  • 20 మిడతవలె అది గంతులు వేయునట్లు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము.
  • 21 మైదానములో అది కాలు దువ్వి తన బలమునుబట్టి సంతోషించును అది ఆయుధధారులను ఎదుర్కొనబోవును.
  • 22 అది భయము పుట్టించుదానిని వెక్కిరించి భీతినొంద కుండును ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు.
  • 23 అంబుల పొదియు తళతళలాడు ఈటెలును బల్లెమును దానిమీద గలగలలాడించబడునప్పుడు
  • 24 ఉద్దండకోపముతో అది బహుగా పరుగులెత్తును అది బాకానాదము విని ఊరకుండదు.
  • 25 బాకానాదము వినబడినప్పుడెల్ల అది అహా అహా అనుకొని దూరమునుండి యుద్ధవాసన తెలిసి కొనును సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధఘోషను వినును.
  • 26 డేగ నీ జ్ఞానముచేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞవలననే తన రెక్కలు దక్షిణదిక్కునకు చాచునా?
  • 27 పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధి కెక్కునా? తన గూడు ఎత్తయినచోటను కట్టుకొనునా?
  • 28 అది రాతికొండమీద నివసించును కొండపేటుమీదను ఎవరును ఎక్కజాలని యెత్తు చోటను గూడు కట్టుకొనును.
  • 29 అక్కడనుండియే తన యెరను వెదకును. దాని కన్నులు దానిని దూరమునుండి కనిపెట్టును.
  • 30 దాని పిల్లలు రక్తము పీల్చును హతులైనవారు ఎక్కడనుందురో అక్కడనే అది యుండును.