wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


న్యాయాధిపతులు చాప్టర్ 5
  • 1 ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి.
  • 2 ఇశ్రాయేలీయులలోయుద్ధశాలులు ధైర్యము కనుపరచిరి ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి.
  • 3 రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి యెహోవాకు గానముచేసెదను.
  • 4 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను యెహోవా, నీవు శేయీరునుండి బయలుదేరినప్పుడు ఎదోము పొలమునుండి బయలుదేరినప్పుడు భూమి వణకెను, ఆకాశము నీళ్లను కురిపించెను మేఘములును వర్షించెను.
  • 5 యెహోవా సన్నిధిని కొండలలోనుండి ప్రవాహములు వచ్చెను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాసన్నిధిని సీనాయిలోనుండి ప్రవాహములు వచ్చెను.
  • 6 అనాతు కుమారుడైన షవ్గురు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు ఎడారు లాయెను ప్రయాణస్థులు చుట్టుత్రోవలలోనే నడిచిరి.
  • 7 ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి దెబోరా అను నేను రాకమునుపు ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండకమునుపు వారు లేకపోయిరి
  • 8 ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను ఇశ్రాయేలీయులలో నలువదివేలమందికి ఒక కేడెమేగాని యీటెయేగాని కనబడలేదు.
  • 9 జనులలో ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి.వారియందు నాకు ప్రేమకలదు యెహోవాను స్తుతించుడి.
  • 10 తెల్లగాడిదల నెక్కువారలారా, తివాసులమీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రక టించుడి.
  • 11 విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు నీళ్లు చేదుకొను స్థలములలో నుండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు ఇశ్రాయేలీయుల గ్రామములో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు.
  • 12 దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము బారాకూ, కీర్తన పాడుము అబీనోయము కుమారుడా, లెమ్ము చెరపట్టిన వారిని చెరపట్టుము.
  • 13 ప్రజలవీరులలో శేషించినవారును కూడి వచ్చిరి శూరులలో యెహోవా నాకు సహాయము చేయ వచ్చెను.
  • 14 అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిమీయు లును నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులును మాకీరునుండి న్యాయాధిపతులును జెబూలూనీయులనుండి నాయకదండము వహించు వారునువచ్చిరి.
  • 15 ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇశ్శాఖారీయులును బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి రూబేనీయుల కాలువలయొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను.
  • 16 మందల యీలలను వినుటకు నీ దొడ్లమధ్యను నీవేల నివసించితివి? రూబేనీయుల కాలువలయొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగెను.
  • 17 గిలాదు యొర్దాను అద్దరిని నిలిచెను దానీయులు ఓడలదగ్గర ఏల నిలిచిరి? ఆషేరీయులు సముద్రతీరమున తమ అఖాతములయొద్ద ఏల నిలిచిరి?
  • 18 జెబూలూనీయులు మరణభయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము నఫ్తాలీయులు భూమి మెట్టలమీద ప్రాణము తృణీక రించిరి.
  • 19 రాజులు వచ్చి యుద్ధముచేసిరి. మెగిద్దో కాలువలయొద్దనున్న తానాకులో కనాను రాజులు యుద్ధముచేసిరి.
  • 20 వెండి లాభము వారు తీసికొనలేదు నక్షత్రములు ఆకాశమునుండి యుద్ధముచేసెను నక్షత్రములు తమ మార్గములలోనుండి సీసెరాతో యుద్ధముచేసెను.
  • 21 కీషోను వాగువెంబడి పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొనిపోయిరి. నా ప్రాణమా నీవు బలముపూని సాగుము.
  • 22 గుఱ్ఱముల డెక్కలు శూరులను త్రొక్కెను గుఱ్ఱములు ఎగసి యెగసి శూరులను త్రొక్కెను.
  • 23 యెహోవా దూత యిట్లనెను మేరోజును శపించుడి దాని నివాసులమీద మహా శాపము నిలుపుడి యెహోవా సహాయమునకు వారు రాలేదు బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు.
  • 24 కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననొందును గుడారములలోనుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును.
  • 25 అతడు దాహమడిగెను ఆమె పాలు తెచ్చియిచ్చెను సర్దారులకు తగిన పాత్రతో మీగడ దెచ్చియిచ్చెను ఆమె మేకును చేత పట్టుకొనెను
  • 26 పనివాని సుత్తెను కుడిచేత పట్టుకొని సీసెరాను కొట్టెను వాని తలను ఆమె పగులగొట్టెను ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను.
  • 27 అతడు ఆమె కాళ్లయొద్ద క్రుంగిపడి పరుండెను ఆమె కాళ్లయొద్ద క్రుంగిపడెను అతడు ఎక్కడ క్రుంగెనో అక్కడనే పడిచచ్చెను.
  • 28 సీసెరా తల్లి కిటికీలోనుండి చూచెను అల్లిక కిటికీలోనుండి చూచి కేకలు వేసెను రాక, అతని రథము తడవుచేయ నేల? అతని రథముల చక్రములు ఆలస్యముచేయ నేల?
  • 29 ఆమెయొద్దనున్న వివేకముగల రాజకుమార్తెలు ఈలాగుననే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తాను మరల ఇట్లనుకొనుచుండెను
  • 30 వారికి దొరకెను గదా? దోపుడుసొమ్ము పంచుకొను చున్నారు గదా? యోధులందరు తలాయొక స్త్రీని తీసికొందురు ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు సీసెరాకు రంగువేయబడిన వస్త్రమొకటి దోపుడు సొమ్ముగా దొరకును రంగువేయబడిన విచిత్ర వస్త్రమొకటి దోపుడుగా దొరకును రెండువైపుల రంగువేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకొనినవారి మెడలకు తగిన వస్త్రమొకటి దొరకును.
  • 31 యెహోవా నీ శత్రువులందరు ఆలాగుననే నశిం చెదరు ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యునివలె నుందురు అనిపాడిరి. తరువాత దేశము నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండెను.