wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


న్యాయాధిపతులు చాప్టర్ 13
  • 1 ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా నలువది సంవత్సరములు వారిని ఫిలిష్తీ యులచేతికి అప్పగించెను.
  • 2 ఆ కాలమున దానువంశస్థుడును జొర్యాపట్టణస్థుడు నైన మానోహ అను నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేకయుండెను.
  • 3 యెహోవా దూత ఆస్త్రీకి ప్రత్యక్షమైఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపులేకపోయెను; అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు.
  • 4 కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి, ద్రాక్షారస మునేగాని మద్యమునేగాని త్రాగకుండుము, అపవిత్ర మైన దేనినైనను తినకుండుము.
  • 5 నీవు గర్భవతివై కుమా రుని కందువు. అతని తలమీద మంగలకత్తి వేయకూడదు; ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీ యులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా
  • 6 ఆ స్త్రీ తన పెనిమిటియొద్దకు వచ్చి దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను; అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడనుండి వచ్చెనో నేనడుగలేదు, అతడు తనపేరు నాతోచెప్పలేదు
  • 7 ​గానిఆలకించుము, నీవు గర్భవతివై కుమా రుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షారసమునేగాని మద్య మునేగాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తిన కుండుము, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చని పోవువరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై యుండునని నాతో చెప్పెననెను.
  • 8 అందుకు మానోహనా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరల మా యొద్దకువచ్చి, పుట్ట బోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయు మని యెహోవాను వేడు కొనగా
  • 9 దేవుడు మానోహ ప్రార్థన నాలకించెను గనుక, ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవునిదూత ఆమెను దర్శించెను.
  • 10 ఆ సమయమున ఆమె పెనిమిటియైన మానోహ ఆమె యొద్దయుండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరుగెత్తిఆనాడు నాయొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడెనని అతనితో చెప్పెను.
  • 11 అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్లి ఆ మనుష్యునియొద్దకు వచ్చిఈ స్త్రీతో మాటలాడినవాడవు నీవేనా అని అతని నడుగగా అతడునేనే అనెను.
  • 12 అందుకు మానోహకావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయ వలసిన కార్యమేమిటో తెలుపుమని మనవిచేయగా
  • 13 యెహోవా దూతనేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెను; ఆమె ద్రాక్షావల్లినుండి పుట్టినదేదియు తినకూడదు,
  • 14 ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు, నేను ఆమె కాజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెనని మానోహతో చెప్పెను.
  • 15 అప్పుడు మానోహమేము ఒక మేకపిల్లను సిద్ధపరచి నీ సన్నిధిని ఉంచువరకు నీవు ఆగుమని మనవి చేసికొనుచున్నామని యెహోవా దూతతో చెప్పగా
  • 16 ​యెహోవా దూతనీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను; నీవు దహనబలి అర్పించ నుద్దేశించిన యెడల యెహోవాకు దాని నర్పింపవలెనని మానోహతో చెప్పెను. అతడు యెహోవా దూత అని మానోహకు తెలియలేదు.
  • 17 మానోహనీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించునట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా
  • 18 ​యెహోవా దూతనీ వేల నాపేరు అడుగుచున్నావు? అది చెప్పశక్యముకాని దనెను.
  • 19 అంతట మానోహ నైవేద్యముగా నొక మేకపిల్లను తీసికొని యొక రాతిమీద యెహోవాకు అర్పించెను. మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత యొక ఆశ్చర్య కార్యము చేసెను.
  • 20 ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీదనుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠముమీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరో హణమాయెను. మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి.
  • 21 ఆ తరువాత యెహోవా దూత మరల మానోహకును అతని భార్యకును ఇక ప్రత్య క్షము కాలేదు.
  • 22 ఆయన యెహోవా దూత అని మానోహ తెలిసికొనిమనము దేవుని చూచితివిు గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా
  • 23 అతని భార్యయెహోవా మనలను చంపగోరినయెడల ఆయన దహనబలిని నైవేద్యమును మనచేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటిని మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను.
  • 24 తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సమ్సోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని నాశీర్వదించెను.
  • 25 మరియు యెహోవా ఆత్మజొర్యా కును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను.