wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


లేవీయకాండము చాప్టర్ 10
  • 1 అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యమువేసి, యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా
  • 2 యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి.
  • 3 అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెనుఇది యెహోవా చెప్పిన మాటనాయొద్దనుండు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచు కొందును; ప్రజలందరియెదుట నన్ను మహిమపరచు కొందును;
  • 4 అహరోను మౌనముగానుండగా మోషే అహరోను పిన తండ్రియైన ఉజ్జీయేలు కుమారులైన మీషా యేలును ఎల్సాఫానును పిలిపించిమీరు సమీపించి పరి శుద్ధ స్థలము నెదుటనుండి పాళెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసికొని పోవుడని వారితో చెప్పెను.
  • 5 మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయిలను తీయకయే పాళెము వెలుపలికి వారిని మోసికొని పోయిరి.
  • 6 అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియా జరు ఈతామారును వారితోమీరు చావకుండునట్లును యెహోవా ఈ సర్వసమాజముమీద ఆగ్రహపడకుండు నట్లును, మీరు తల విరియబోసికొనకూడదు; బట్టలను చింపుకొనకూడదు కాని, యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరు లైన ఇశ్రాయేలీయుల యింటివారందరు ఏడవ వచ్చును.
  • 7 యెహోవా అభిషేకతైలము మీ మీద నున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారములోనుండి బయలు వెళ్ల కూడ దనెను. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి.
  • 8 మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెనుమీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చునప్పుడు
  • 9 మీరు చావ కుండునట్లు నీవును నీ కుమారులును ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకూడదు.
  • 10 మీరు ప్రతిష్ఠింపబడిన దానినుండి లౌకికమైనదానిని, అపవిత్రమైనదానినుండి పవిత్రమైనదానిని వేరుచేయుటకును,
  • 11 యెహోవా మోషేచేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధు లను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైనకట్టడ.
  • 12 అప్పుడు మోషే అహరోనుతోను మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతోను ఇట్ల నెనుమీరు యెహోవా హోమద్రవ్యములలో మిగిలిన నైవేద్య మును తీసికొని అది పొంగకుండ బలిపీఠము దగ్గర తినుడి; అది అతిపరిశుద్ధము. యెహోవా హోమద్రవ్యములో నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడినవంతు.
  • 13 కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను; నేను అట్టి ఆజ్ఞను పొందితిని.
  • 14 మరియు అల్లాడించు బోరను ప్రతిష్ఠిత మైన జబ్బను మీరు, అనగా నీవును నీతోపాటు నీ కుమారులును నీ కుమార్తెలును పవిత్రస్థలములో తిన వలెను. ఏలయనగా అవి ఇశ్రాయేలీయులు అర్పించు సమాధానబలులలోనుండి నీకును నీ కుమారులకును నియ మింపబడిన వంతులు.
  • 15 ​హోమద్రవ్య రూపమైన క్రొవ్వును గాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిగా దానిని అల్లాడించునట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించు బోరను తీసికొని రావలెను. నిత్యమైన కట్టడచొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును. అట్లు యెహోవా ఆజ్ఞాపించెను.
  • 16 అప్పుడు మోషే పాపపరిహారార్థబలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెదకినప్పుడు అది కాలిపోయి యుండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఈతామారను వారిమీద ఆగ్రహపడి
  • 17 మీరు పరిశుద్ధస్థలములో ఆ పాపపరిహారార్థబలిపశువును ఏల తినలేదు? అది అతిపరిశుద్ధముగదా. సమాజము యొక్క దోషశిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకిచ్చెను గదా.
  • 18 ఇదిగో దాని రక్తమును పరిశుద్ధస్థలము లోనికి తేవలెను గదా. నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయ ముగా పరిశుద్ధస్థలములో దానిని తినవలెనని చెప్పెను.
  • 19 అందుకు అహరోను మోషేతోఇదిగో నేడు పాప పరిహారార్థ బలిపశువును దహనబలిద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను. నేను పాపపరిహారార్థమైన బలిద్రవ్యమును నేడు తినిన యెడల అది యెహోవా దృష్టికి మంచిదగునా అనెను.
  • 20 మోషే ఆ మాట విని ఒప్పుకొనెను.