- 1 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము.
- 2 పురుషుడేగాని స్త్రీయేగాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్నుతాను ప్రత్యేకించు కొనినయెడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను.
- 3 ద్రాక్షా రసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు; ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు; పచ్చివిగాని యెండి నవిగాని ద్రాక్షపండ్లను తినవలదు.
- 4 అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నియు పచ్చికాయలేగాని పైతోలేగాని ద్రాక్షావల్లిని పుట్టిన దేదియు తినవలదు.
- 5 అతడు నాజీ రగుటకు మ్రొక్కు కొనిన దినములన్నిటిలో మంగలకత్తి అతని తలమీద వేయవలదు, అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరువరకు అతడు ప్రతిష్ఠితుడై తన తలవెండ్రుకలను ఎదుగనియ్యవలెను.
- 6 అతడు యెహోవాకు ప్రత్యేకముగానుండు దినములన్ని టిలో ఏ శవమును ముట్టవలదు.
- 7 తన దేవునికి మీదు కట్ట బడిన తలవెండ్రుకలు అతని తలమీద నుండును గనుక అతని తండ్రిగాని తల్లిగాని సహోదరుడుగాని సహోదరి గాని చనిపోయినను వారినిబట్టి అతడు తన్ను తాను అప విత్రపరచుకొనవలదు.
- 8 అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నియు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును.
- 9 ఒకడు అతనియొద్ద హఠాత్తుగా చనిపోవుట వలన ప్రత్యేకముగా ఉండువాని తల అపవిత్రపరపబడిన యెడల అతడు పవిత్రపరపబడు దినమున, అనగా ఏడవ దినమున తనతల గొరిగించుకొనవలెను.
- 10 ఎనిమిదవ దినమున అతడు రెండు తెల్లగువ్వలనైనను రెండు పావురపు పిల్లల నైనను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నున్న యాజకునియొద్దకు తేవలెను.
- 11 అప్పుడు యాజకుడు ఒకదానితో పాపపరిహారార్థబలిని రెండవ దానితో దహన బలిని అర్పించి, వాడు శవము ముట్టుటవలన పాపి యైనందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేసి ఆ దిన మున వాని తలను పరిశుద్ధ పరపవలెను.
- 12 మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరల యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధపరిహారార్థబలిగా ఏడాది గొఱ్ఱపిల్లను తీసికొని రావలెను; తన వ్రతసంబంధమైన తలవెండ్రుకలు అపవిత్రపరపబడెను గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి.
- 13 నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తరు వాత వానిగూర్చిన విధి యేదనగా, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వానిని తీసికొని రావలెను.
- 14 అప్పుడతడు దహనబలిగాను నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱపిల్లను, పాపపరిహారార్థబలిగాను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱపిల్లను, సమాధాన బలిగాను నిర్దోష మైన యొక పొట్టేలును,
- 15 గంపెడు పొంగని పిండి, అనగా గోధమపిండి వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణ ముగా యెహోవాయొద్దకు తేవలెను.
- 16 అప్పుడు యాజ కుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పింపవలెను.
- 17 యాజ కుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలును యెహోవాకు సమాధానబలిగా అర్పింపవలెను; వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలెను.
- 18 అప్పుడా నాజీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద తన వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు గొరిగించు కొని, ఆ వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు తీసికొని, సమాధానబలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను.
- 19 మరియు యాజకుడు ఆ పొట్టేలుయొక్క వండిన జబ్బను ఆ గంపలోనుండి పొంగని యొక భక్ష్యమును పొంగని యొక పూరీని తీసికొని నాజీరు తన వ్రతసంబంధమైన వెండ్రుకలు గొరికించుకొనిన పిమ్మట అతని చేతుల మీద వాటి నుంచవలెను.
- 20 తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలెను. అల్లాడింపబడు బోరతోను ప్రతిష్ఠిత మైన జబ్బతోను అది యాజకునికి ప్రతిష్ఠితమగును; తరు వాత ఆ నాజీరు ద్రాక్షారసము త్రాగవచ్చును.
- 21 మ్రొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాని గూర్చిన విధియు, అతడు నాజీరైయున్నందున యెహో వాకు అర్పింపవలసిన దాని గూర్చిన విధియు ఇదే. తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధిని బట్టి ఇదియంతయు చేయవలెనని చెప్పుము.
- 22 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు అహరోనుతోను అతని కుమారులతోను ఈలాగనుము
- 23 మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను.
- 24 యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక;
- 25 యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక;
- 26 యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక.
- 27 అట్లు వారు ఇశ్రాయేలీయులమీద నా నామ మును ఉచ్చరించుటవలన నేను వారిని ఆశీర్వదించెదను.
Numbers 06
- Details
- Parent Category: Old Testament
- Category: Numbers
సంఖ్యాకాండము చాప్టర్ 6