wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


సంఖ్యాకాండము చాప్టర్ 21
  • 1 ఇశ్రాయేలీయులు అతారీయుల మార్గమున వచ్చు చున్నారని దక్షిణదిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని, అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసి వారిలో కొందిరిని చెరపట్టగా
  • 2 ఇశ్రాయేలీయులు యెహోవాకు మ్రొక్కుకొని నీవు మా చేతికి ఈ జన మును బొత్తిగా అప్పగించినయెడల మేము వారి పట్టణము లను నీ పేరట నిర్మూలము చేసెదమనిరి.
  • 3 ​యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను.
  • 4 ​వారు ఎదోముదేశమును చుట్టి పోవలెనని హోరు కొండనుండి ఎఱ్ఱసముద్రమార్గముగా సాగినప్పుడు మార్గా యాసముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను.
  • 5 కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడిఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్య మైనదనిరి.
  • 6 అందుకు యెహోవా ప్రజలలోనికి తాప కరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి.
  • 7 కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చిమేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితివిు; యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి.
  • 8 ​మోషే ప్రజలకొరకు ప్రార్థన చేయగా యెహోవానీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రదుకునని మోషేకు సెలవిచ్చెను.
  • 9 కాబట్టి మోషే ఇత్తడి సర్ప మొకటి చేయించి స్తంభముమీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపుకాటు తినిన ప్రతివాడు ఆ యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికెను.
  • 10 తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి.
  • 11 ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయదిక్కున, అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఈయ్యె అబారీమునొద్ద దిగిరి.
  • 12 అక్కడనుండి వారు సాగి జెరెదు లోయలో దిగిరి.
  • 13 అక్కడనుండి వారు సాగి అమోరీయుల పొలిమేరలనుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీ యులకును మధ్యనుండు మోయాబు సరిహద్దు.
  • 14 కాబట్టి యెహోవా సుడిగాలిచేతనైనట్టు వాహేబును అర్నో నులో పడు ఏరులను ఆరు దేశ నివాసస్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా
  • 15 ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెననుమాట యెహోవా యుద్ధ ముల గ్రంథములో వ్రాయబడియున్నది.
  • 16 ​అక్కడనుండి వారు బెయేరుకు వెళ్లిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్ల నిచ్చెదనని మోషేతో చెప్పిన బావి అది.
  • 17 అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి బావీ ఉబుకుము. దాని కీర్తించుడి బావీ; యేలికలు దాని త్రవ్విరి
  • 18 తమ అధికార దండములచేతను కఱ్ఱలచేతను జనుల అధికారులు దాని త్రవ్విరి.
  • 19 వారు అరణ్యమునుండి మత్తానుకును మత్తానునుండి నహలీయేలుకును నహలీయేలునుండి బామోతుకును
  • 20 మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతునుండి యెడారికి ఎదురుగానున్న పిస్గాకొండకు వచ్చిరి.
  • 21 ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపిమమ్మును నీ దేశములో బడి వెళ్లనిమ్ము.
  • 22 మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము; బావుల నీళ్లు త్రాగము; మేము నీ పొలిమేరలను దాటువరకు రాజమార్గములోనే నడిచి పోదుమని అతనితో చెప్పించిరి.
  • 23 అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనియ్య లేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసెను.
  • 24 ఇశ్రాయేలీయులు వానిని కత్తివాత హతముచేసి, వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకువరకు, అనగా అమ్మోనీయుల దేశమువరకు స్వాధీనపరచుకొనిరి. అమ్మోనీయుల పొలిమేర దుర్గమమైనది.
  • 25 అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటిని పట్టుకొనిరి. ఇశ్రాయేలీయులు అమోరీ యుల పట్టణములన్నిటిలోను హెష్బోనులోను దాని పల్లె లన్నిటిలోను దిగిరి.
  • 26 హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము; అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధముచేసి అర్నోనువరకు వాని దేశమంతయు పట్టుకొనెను.
  • 27 ​కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు హెష్బోనుకు రండి సీహోను పట్టణమును కట్టవలెను దానిని స్థాపింపవలెను
  • 28 ​హెష్బోనునుండి అగ్ని బయలువెళ్లెను సీహోను పట్టణమునుండి జ్వాలలు బయలువెళ్లెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోనుయొక్క ఉన్నతస్థలముల ప్రభువులను కాల్చెను.
  • 29 మోయాబూ, నీకు శ్రమ కెమోషు జనులారా, మీరు నశించితిరి తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీయులరాజైన సీహోనుకు చెరగాఇచ్చెను.
  • 30 వాటిమీద గురిపెట్టి కొట్టితివిు దీబోనువరకు హెష్బోను నశించెను నోఫహువరకు దాని పాడు చేసితివిు. అగ్నివలన మేదెబావరకు పాడుచేసితివిు.
  • 31 అట్లు ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశములో దిగిరి.
  • 32 ​మరియు యాజెరు దేశమును సంచరించి చూచు టకై మోషే మనుష్యులను పంపగా వారు దాని గ్రామ ములను వశము చేసికొని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి.
  • 33 వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్లినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయీలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా
  • 34 యెహోవా మోషేతో నిట్లనెను అతనికి భయపడకుము; నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని; నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయుదువు.
  • 35 కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండ అతని సమస్త జనమును హతముచేసి అతని దేశమును స్వాధీన పరచుకొనిరి.