wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


సామెతలు చాప్టర్ 23
  • 1 నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండినయెడల నీవెవరి సమక్షమున నున్నావో బాగుగా యోచిం చుము.
  • 2 నీవు తిండిపోతువైనయెడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము.
  • 3 అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు.
  • 4 ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము.
  • 5 నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరి పోవును.
  • 6 ఎదుటివాని మేలు ఓర్చలేనివానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థముల నాశింపకుము.
  • 7 అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొను వాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములోనుండి వచ్చు మాట కాదు.
  • 8 నీవు తినినను తినినదానిని కక్కి వేయుదువు నీవు పలికిన యింపైన మాటలు వ్యర్థములగును.
  • 9 బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును.
  • 10 పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తలిదండ్రులు లేనివారి పొలములోనికి నీవు చొరబడ కూడదు
  • 11 వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారిపక్షమున నీతో వ్యాజ్యెమాడును.
  • 12 ఉపదేశముమీద మనస్సు నుంచుము తెలివిగల మాటలకు చెవి యొగ్గుము.
  • 13 నీ బాలురను శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాని కొట్టినయెడల వాడు చావకుండును
  • 14 బెత్తముతో వాని కొట్టినయెడల పాతాళమునకు పోకుండ వాని ఆత్మను నీవు తప్పించె దవు.
  • 15 నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయముకూడ సంతోషించును.
  • 16 నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును.
  • 17 పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుము.
  • 18 నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు.
  • 19 నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము.
  • 20 ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగాతినువారితోనైనను సహ వాసము చేయకుము.
  • 21 త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును.
  • 22 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము.
  • 23 సత్యమును అమి్మవేయక దాని కొనియుంచు కొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియుంచు కొనుము.
  • 24 నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానముగలవానిని కనినవాడు వానివలన ఆనందము నొందును.
  • 25 నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను.
  • 26 నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము,
  • 27 వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ యిరుకైన గుంట.
  • 28 దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచి యుండును అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును.
  • 29 ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువులేని గాయములు?ఎవరికి మంద దృష్టి?
  • 30 ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా కలిపిన ద్రాక్షారసము రుచిచూడ చేరువారికే గదా.
  • 31 ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము.
  • 32 పిమ్మట అది సర్పమువలె కరచును కట్లపామువలె కాటువేయును.
  • 33 విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెఱ్ఱిమాటలు పలుకుదువు
  • 34 నీవు నడిసముద్రమున పండుకొనువానివలె నుందువు ఓడకొయ్య చివరను పండుకొనువానివలె నుందువు.
  • 35 నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు నామీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును? మరల దాని వెదకుదును అని నీవనుకొందువు.