- 1 నా నాలుకతో పాపముచేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు ననుకొంటిని.
- 2 నేను ఏమియు మాటలాడక మౌనినైతిని క్షేమమును గూర్చియైనను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయెను.
- 3 నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని
- 4 యెహోవా, నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసికొన గోరుచున్నాను.
- 5 నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి యున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు.(సెలా.)
- 6 మనుష్యులు వట్టి నీడవంటివారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు.
- 7 ప్రభువా, నేను దేనికొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొనియున్నాను.
- 8 నా అతిక్రమములన్నిటినుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము.
- 9 దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌని నైతిని.
- 10 నీవు పంపిన తెగులు నా మీదనుండి తొలగింపుము. నీ చేతి దెబ్బవలన నేను క్షీణించుచున్నాను.
- 11 దోషములనుబట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించునప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రమువలె నీవు వారి అందము చెడ గొట్టెదవు నరులందరు వట్టి ఊపిరివంటివారు. (సెలా.)
- 12 యెహోవా, నా ప్రార్థన ఆలంకిపుము నా మొఱ్ఱకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగానుండకుము నీ దృష్టికి నేను అతిథివంటివాడను నా పితరులందరివలె నేను పరవాసినైయున్నాను
- 13 నేను వెళ్లిపోయి లేకపోకమునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము.
Psalms 039
- Details
- Parent Category: Old Testament
- Category: Psalms
కీర్తనల గ్రంథము చాప్టర్ 39