- 1 దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసినపనినిగూర్చి మేము చెవులార విని యున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి
- 2 నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్లగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి.
- 3 వారు తమ ఖడ్గముచేత దేశమును స్వాధీనపరచు కొనలేదు వారి బాహువు వారికి జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను.
- 4 దేవా, నీవే నా రాజవు యాకోబునకు పూర్ణరక్షణ కలుగ నాజ్ఞాపించుము.
- 5 నీవలన మా విరోధులను అణచివేయుదుము నీ నామమువలననే, మామీదికి లేచువారిని మేము త్రొక్కి వేయుదుము.
- 6 నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు
- 7 మా శత్రువుల చేతిలోనుండి మమ్మును రక్షించు వాడవు నీవే మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే.
- 8 దినమెల్ల మేము దేవునియందు అతిశయపడుచున్నాము నీ నామమునుబట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.(సెలా.)
- 9 అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమాన పరచియున్నావు. మాసేనలతోకూడ నీవు బయలుదేరకయున్నావు.
- 10 శత్రువులయెదుట నిలువకుండ మమ్మును వెనుకకు పారి పోజేయుచున్నావు మమ్మును ద్వేషించువారు ఇష్టమువచ్చినట్లు మమ్మును దోచుకొనుచున్నారు.
- 11 భోజనపదార్థముగా ఒకడు గొఱ్ఱలను అప్పగించునట్లు నీవు మమ్మును అప్పగించియున్నావు అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టి యున్నావు
- 12 అధికమైన వెల చెప్పక ధనప్రాప్తిలేకయే నీవే నీ ప్రజలను అమి్మ యున్నావు
- 13 మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పద ముగా చేసియున్నావు మా చుట్టు నున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణ ముగాను మమ్మును ఉంచి యున్నావు.
- 14 అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు.
- 15 నన్ను నిందించి దూషించువారి మాటలు వినగా శత్రువులనుబట్టియు పగ తీర్చుకొనువారినిబట్టియు
- 16 నేను దినమెల్ల నా అవమానమును తలపోయుచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది.
- 17 ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువ లేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు.
- 18 మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు.
- 19 అయితే నక్కలున్నచోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు గాఢాంధకారముచేత మమ్మును కప్పియున్నావు
- 20 మా దేవుని నామమును మేము మరచియున్నయెడల అన్యదేవతలతట్టు మా చేతులు చాపియున్నయెడల
- 21 హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా?
- 22 నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడుచున్నాము వధకు సిద్ధమైన గొఱ్ఱలమని మేము ఎంచబడు చున్నాము
- 23 ప్రభువా, మేల్కొనుము నీవేల నిద్రించుచున్నావు? లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము.
- 24 నీ ముఖమును నీ వేల మరుగుపరచి యున్నావు? మా బాధను మాకు కలుగు హింసను నీవేల మరచి యున్నావు?
- 25 మా ప్రాణము నేలకు క్రుంగియున్నది మా శరీరము నేలను పట్టియున్నది.
- 26 మా సహాయమునకు లెమ్ము నీ కృపనుబట్టి మమ్మును విమోచింపుము.
Psalms 044
- Details
- Parent Category: Old Testament
- Category: Psalms
కీర్తనల గ్రంథము చాప్టర్ 44