- 1 నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ శరణుజొచ్చి యున్నాను ఈ ఆపదలు తొలగిపోవువరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి యున్నాను.
- 2 మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలముచేయు దేవునికి నేను మొఱ్ఱ పెట్టుచున్నాను.
- 3 ఆయన ఆకాశమునుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మింగగోరువారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును.(సెలా.)
- 4 నా ప్రాణము సింహములమధ్య నున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి.
- 5 దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము.
- 6 నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి నా ప్రాణము క్రుంగియున్నది. నా యెదుట గుంట త్రవ్వి దానిలో తామేపడిరి. (సెలా.)
- 7 నా హృదయము నిబ్బరముగా నున్నది దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను.
- 8 నా ప్రాణమా, మేలుకొనుము స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను.
- 9 నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘమండలమువరకు వ్యాపించియున్నది.
- 10 ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించెదను.
- 11 దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము. నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము.
Psalms 057
- Details
- Parent Category: Old Testament
- Category: Psalms
కీర్తనల గ్రంథము చాప్టర్ 57