- 1 సొలొమోను రచించిన పరమగీతము.
- 2 నోటిముద్దులతో అతడు నన్ను ముద్దుపెట్టుకొనును గాక నీ ప్రేమ ద్రాక్షారసముకన్న మధురము.
- 3 నీవు పూసికొను పరిమళతైలము సువాసనగలది నీ పేరు పోయబడిన పరిమళతైలముతో సమానము కన్యకలు నిన్ను ప్రేమించుదురు.
- 4 నన్ను ఆకర్షించుము మేము నీయొద్దకు పరుగెత్తి వచ్చెదము రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను నిన్నుబట్టి మేము సంతోషించి ఉత్సహించెదము ద్రాక్షారసముకన్న నీ ప్రేమను ఎక్కువగా స్మరించె దము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించు చున్నారు.
- 5 యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి గుడారములవలెను సొలొమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను
- 6 నల్లనిదాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలినదానను నా సహోదరులు నామీద కోపించి నన్ను ద్రాక్షతోటకు కావలికత్తెగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని.
- 7 నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుకువేసికొనినదాననై నీ జతకాండ్ల మందలయొద్ద నేనెందుకుండవలెను?
- 8 నారీమణీ, సుందరీ, అది నీకు తెలియకపోయెనా? మందల యడుగుజాడలనుబట్టి నీవు పొమ్ము మందకాపరుల గుడారములయొద్ద నీ మేకపిల్లలను మేపుము.
- 9 నా ప్రియురాలా, ఫరోయొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను.
- 10 ఆభరణములచేత నీ చెక్కిళ్లును హారములచేత నీ కంఠమును శోభిల్లుచున్నవి.
- 11 వెండి పువ్వులుగల బంగారు సరములు మేము నీకు చేయింతుము
- 12 రాజు విందుకు కూర్చుండియుండగా నా పరిమళతైలపు సువాసన వ్యాపించెను.
- 13 నా ప్రియుడు నా రొమ్ముననుండు గోపరసమంత సువాసనగలవాడు
- 14 నాకు నా ప్రియుడు ఏన్గెదీ ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు.
- 15 నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు.
- 16 నా ప్రియుడా, నీవు సుందరుడవు అతిమనోహరుడవు మన శయనస్థానము పచ్చనిచోటు
- 17 మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు మన వాసములు సరళపు మ్రానులు.
Song Of Solomon 01
- Details
- Parent Category: Old Testament
- Category: Song of Songs
పరమగీతము చాప్టర్ 1