- 1 కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టు కొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను.
- 2 ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ప్రతి అతి క్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా
- 3 ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు భోధించుటచేత ఆరంభమై,
- 4 దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలచేతను, మహత్కార్య ములచేతను,నానావిధములైన అద్భుతములచేతను, వివిధము లైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను.
- 5 మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు.
- 6 అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడే పాటివాడు?
- 7 నీవు దేవదూతలకంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసితివి మహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింప జేసితివి నీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి వాని పాదములక్రింద సమస్తమును ఉంచితివి.
- 8 ఆయన సమస్తమును లోపరచినప్పుడు వానికి లోపరచకుండ దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికిలోపరచబడుట ఇంకను చూడ లేదుగాని
- 9 దేవుని కృపవలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు,దూతలకంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొంది నందున, మహిమాప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము
- 10 ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూ ర్ణునిగా చేయుట ఆయనకు తగును.
- 11 పరిశుద్ధ పరచువారి కిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే1 మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక
- 12 నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజముమధ్య2 నీ కీర్తిని గానము చేతును అనెను.
- 13 మరియు నే నాయనను నమ్ముకొనియుందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు.
- 14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంస ములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును,
- 15 జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.
- 16 ఏల యనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు.
- 17 కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్య ములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్నివిషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.
- 18 తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయ గలవాడై యున్నాడు.
Hebrews 02
- Details
- Parent Category: New Testament
- Category: Hebrews
హెబ్రీయులకు చాప్టర్ 2