wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


హెబ్రీయులకు చాప్టర్ 12
  • 1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున
  • 2 మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.
  • 3 మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కార మంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి.
  • 4 మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు.
  • 5 మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము
  • 6 ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాంషించు ఆయన హెచ్చరికను మరచితిరి.
  • 7 శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు?
  • 8 కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు.
  • 9 మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుక వలెనుగదా?
  • 10 వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించు చున్నాడు.
  • 11 మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కన బడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.
  • 12 కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి.
  • 13 మరియు కుంటికాలు బెణకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసికొనుడి.
  • 14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.
  • 15 మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు,
  • 16 ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమి్మవేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి.
  • 17 ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను, మారుమనస్సుపొంద నవకాశము దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు.
  • 18 స్పృశించి తెలిసికొనదగినట్టియు, మండుచున్నట్టియు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధ కారమునకును, తుపానుకును,
  • 19 బూరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చియుండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకినయెడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక,
  • 20 ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలు కొనిరి.
  • 21 మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషేనేను మిక్కిలి భయపడి వణకు చున్నాననెను.
  • 22 ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును,
  • 23 పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్టుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధి పతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతి మంతుల ఆత్మల యొద్దకును,
  • 24 క్రొత్తనిబంధనకు మధ్య వర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు.
  • 25 మీకు బుద్ధి చెప్పుచున్నవానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమిమీదనుండి బుద్ధిచెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినయెడల, పరలోకమునుండి బుద్ధిచెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయముగదా.
  • 26 అప్పు డాయన శబ్దము భూమిని చలింపచేసెను గాని యిప్పుడు నే నింకొకసారి భూమిని మాత్రమేకాక ఆకాశమును కూడ కంపింపచేతును అని మాట యిచ్చియున్నాడు.
  • 27 ఇంకొకసారి అను మాట చలింపచేయబడనివి నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపచేయబడినవి బొత్తిగా తీసి వేయబడునని అర్ధమిచ్చుచున్నది.
  • 28 అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగియుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము,
  • 29 ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు.