wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


హెబ్రీయులకు చాప్టర్ 13
  • 1 సహోదరప్రేమ నిలువరముగా ఉండనీయుడి
  • 2 ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి.
  • 3 మీరును వారితోకూడ బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి.మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టముల ననుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి.
  • 4 వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.
  • 5 ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి.నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.
  • 6 కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.
  • 7 మీకు దేవుని వాక్యము బోధించి, మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి.
  • 8 యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును.
  • 9 నానా విధములైన అన్య బోధలచేత త్రిప్పబడకుడి. భోజనపదార్థములనుబట్టి కాక, కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది; భోజనము లనుబట్టి ప్రవర్తించినవారికి ఏమియు ప్రయోజనము కలుగ లేదు.
  • 10 మనకొక బలిపీఠమున్నది; దాని సంబంధమైనవాటిని తినుటకు గుడారములో సేవచేయువారికి అధికారములేదు.
  • 11 వేటిరక్తము పాపపరిహారార్థముగ పరిశుద్ధస్థలములోనికి ప్రధానయాజకునిచేత తేబడునో, ఆ జంతువులకళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును.
  • 12 కావున యేసుకూడ తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను.
  • 13 కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయనయొద్దకు వెళ్లుదము.
  • 14 నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదాని కోసము ఎదురుచూచు చున్నాము.
  • 15 కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.
  • 16 ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని కిష్టమైనవి.
  • 17 మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.
  • 18 మా నిమిత్తము ప్రార్థనచేయుడి; మేమన్ని విషయ ములలోను యోగ్యముగా ప్రవర్తింప గోరుచు మంచి మనస్సాక్షి కలిగియున్నామని నమ్ముకొనుచున్నాను.
  • 19 మరియు నేను మరి త్వరగా మీయొద్దకు మరల వచ్చునట్లు ఈలాగు చేయవలెనని మరి యెక్కువగా మిమ్మును బతి మాలుకొనుచున్నాను.
  • 20 గొఱ్ఱల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు,
  • 21 యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్‌.
  • 22 సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసియున్నాను గనుక ఈ హెచ్చరికమాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను.
  • 23 మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలిసికొనుడి. అతడు శీఘ్రముగా వచ్చినయెడల అతనితోకూడ వచ్చి మిమ్మును చూచెదను.
  • 24 మీపైని నాయకులైనవారికందరికిని పరిశుద్ధులకందరికిని నా వందనములు చెప్పుడి. ఇటలీవారు మీకు వందనములు చెప్పుచున్నారు.
  • 25 కృప మీ అందరికి తోడైయుండును గాక. ఆమేన్‌.