- 1 రాష్ట్రములారా, నాయొద్దకు వచ్చి వినుడి జనములారా, చెవి యొగ్గి ఆలకించుడి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినును గాక.
- 2 యెహోవా కోపము సమస్త జనములమీదికి వచ్చు చున్నది వారి సర్వ సైన్యములమీద ఆయన క్రోధము వచ్చు చున్నది ఆయన వారిని శపించి వధకు అప్పగించెను.
- 3 వారిలో చంపబడినవారు బయట వేయబడెదరు వారి శవములు కంపుకొట్టును వారి రక్తమువలన కొండలు కరగిపోవును.
- 4 ఆకాశ సైన్యమంతయు క్షీణించును కాగితపు చుట్టవలె ఆకాశవైశాల్యములు చుట్టబడును. ద్రాక్షావల్లినుండి ఆకు వాడి రాలునట్లు అంజూరపుచెట్టునుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును.
- 5 నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును ఎదోముమీద తీర్పుతీర్చుటకు నేను శపించిన జనముమీద తీర్పుతీర్చుటకు అది దిగును
- 6 యెహోవా ఖడ్గము రక్తమయమగును అది క్రొవ్వుచేత కప్పబడును గొఱ్ఱపిల్లలయొక్కయు మేకలయొక్కయు రక్తము చేతను పొట్లేళ్ల మూత్రగ్రంథులమీది క్రొవ్వుచేతను కప్ప బడును ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును ఎదోము దేశములో ఆయన మహా సంహారము చేయును.
- 7 వాటితోకూడ గురుపోతులును వృషభములును కోడె లును దిగిపోవుచున్నవి ఎదోమీయుల భూమి రక్తముతో నానుచున్నది వారి మన్ను క్రొవ్వుతో బలిసియున్నది.
- 8 అది యెహోవా ప్రతిదండనచేయు దినము సీయోను వ్యాజ్యెమునుగూర్చిన ప్రతికార సంవత్సరము.
- 9 ఎదోము కాలువలు కీలగును దాని మన్ను గంధకముగా మార్చబడును దాని భూమి దహించు గంధకముగా ఉండును.
- 10 అది రేయింబగళ్లు ఆరక యుండును దాని పొగ నిత్యము లేచును అది తరతరములు పాడుగా నుండును ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు
- 11 గూడబాతులును ఏదుపందులును దాని ఆక్రమించు కొనును గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును ఆయన తారుమారు అను కొలనూలును చాచును శూన్యమను గుండును పట్టును.
- 12 రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోవుదురు దాని అధిపతులందరు గతమైపోయిరి.
- 13 ఎదోము నగరులలో ముళ్లచెట్లు పెరుగును దాని దుర్గములలో దురదగొండ్లును గచ్చలును పుట్టును అది అడవికుక్కలకు నివాసస్థలముగాను నిప్పుకోళ్లకు సాలగాను ఉండును
- 14 అడవిపిల్లులును నక్కలును అచ్చట కలిసికొనును అచ్చట అడవిమేక తనతోటి జంతువును కనుగొనును అచ్చట చువ్వపిట్ట దిగి విశ్రమస్థలము చూచుకొనును
- 15 చిత్తగూబ గూడు కట్టుకొనును అచ్చట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును అచ్చటనే తెల్లగద్దలు తమ జాతిపక్షులతో కూడు కొనును.
- 16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి ఆ జంతువులలో ఏదియు లేక యుండదు దేని జతపక్షి దానియొద్ద ఉండక మానదు నా నోటనుండి వచ్చిన ఆజ్ఞ యిదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగుచేయును.
- 17 అవి రావలెనని ఆయన చీట్లువేసెను ఆయన కొలనూలు చేత పట్టుకొని వాటికి ఆ దేశమును పంచిపెట్టును. అవి నిత్యము దాని ఆక్రమించుకొనును యుగయుగములు దానిలో నివసించును.
Isaiah 34
- Details
- Parent Category: Old Testament
- Category: Isaiah
యెషయా గ్రంథము చాప్టర్ 34