- 1 నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?
- 2 ఆలాగు చేసినయెడల పరముననున్న దేవుని ఆజ్ఞ యేమగును?ఉన్నతస్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును?
- 3 దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా పాపము చేయువారికి దురవస్థ ప్రాప్తించుటయే గదా.
- 4 ఆయన నా ప్రవర్తన నెరుగుమ గదా నా అడుగుజాడలనన్నిటిని లెక్కించును గదా
- 5 అబద్ధికుడనై నేను తిరుగులాడినయెడల మోసముచేయుటకై నా కాలు త్వరపడినయెడల
- 6 నేను యథార్థుడనై యున్నానని దేవుడు తెలిసి కొనునట్లు
- 7 న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. నేను త్రోవవిడిచి నడచినయెడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించినయెడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలినయెడల
- 8 నేను విత్తినదానిని వేరొకడు భుజించును గాక నేను నాటినది పెరికివేయబడును గాక.
- 9 నేను హృదయమున పరస్త్రీని మోహించినయెడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న యెడల
- 10 నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక ఇతరులు ఆమెను కూడుదురు గాక.
- 11 అది దుష్కామకార్యము అది న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేరము
- 12 అది నాశనకూపమువరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును.
- 13 నా పనివాడైనను పనికత్తెయైనను నాతో వ్యాజ్యె మాడగా నేను వారి వ్యాజ్యెమును నిర్లక్ష్యము చేసినయెడల
- 14 దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును?
- 15 గర్భమున నన్ను పుట్టించినవాడు వారినికూడ పుట్టింప లేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా.
- 16 బీదలు ఇచ్ఛయించినదానిని నేను బిగబట్టినయెడలను విధవరాండ్రకన్నులు క్షీణింపజేసినయెడలను
- 17 తలిదండ్రులు లేనివారిని నా అన్నములో కొంచె మైనను తిననియ్యక నేను ఒంటరిగా భోజనము చేసినయెడలను
- 18 ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను
- 19 వారి దేహములు నన్ను దీవింపకపోయినయెడలను వారు నా గొఱ్ఱలబొచ్చుచేత వేడిమి పొందకపోయిన యెడలను
- 20 గుమ్మములో నాకు సహాయము దొరకునని తండ్రిలేనివారిని నేను అన్యాయము చేసినయెడలను
- 21 నా భుజశల్యము దాని గూటినుండి పడును గాక నా బాహువు ఎముకలోనికి విరుగును గాక.
- 22 నేనాలాగు చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కు లేనివాడు తండ్రిభావముతో నన్ను భావించి నాయొద్ద పెరిగెను.నా తల్లి గర్భమందు పుట్టిననాటనుండి దిక్కు లేని వానికి నేను మార్గదర్శినైతిని.
- 23 దేవుని మహాత్మ్యము ఎదుట నేను నిలువజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతిపుట్టెను.
- 24 సువర్ణము నాకు ఆధారమనుకొనినయెడలను నా ఆశ్రయము నీవేయని మేలిమి బంగారముతో నేను చెప్పినయెడలను
- 25 నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికెనని గాని నేను సంతోషించిన యెడలను
- 26 సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినేగాని చంద్రుడు మిక్కిలి కాంతికలిగి నడచుచుండగా అతనినేగాని చూచి
- 27 నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారితట్టు చూచి నా నోరు ముద్దుపెట్టినయెడలను పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును.
- 28 అదియు న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేర మగును.
- 29 నన్ను ద్వేషించినవానికి కలిగిన నాశనమునుబట్టి నేను సంతోషించినయెడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన యెడలను
- 30 నేనాలాగు చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు పాపముచేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు.
- 31 అతడు పెట్టిన భోజనము తిని, తృప్తి పొందనివానిని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకనియెడలను
- 32 పరదేశిని వీధిలో ఉండనియ్యక నా యింటి వీధితలుపులు తెరచితిని గదా.
- 33 ఆదాము చేసినట్లు నా దోషములను దాచి పెట్టుకొని
- 34 మహా సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగానుండి ద్వారము దాటి బయలు వెళ్లక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన యెడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును
- 35 నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను; ఇదిగో నా చేవ్రాలు గురుతు. ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకుత్తరమిచ్చును గాక.
- 36 నిశ్చయముగా నేను నా భుజముమీద దానిని వేసి కొందును నాకు కిరీటముగా దానిని ధరించుకొందును.
- 37 నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసెదను, రాజు వలె నేనాయనయొద్దకు వెళ్లెదను.
- 38 నా భూమి నామీద మొఱ్ఱపెట్టినయెడలను దాని చాళ్లు ఏకమై యేడ్చినయెడల
- 39 క్రయధనము ఇయ్యక దాని ననుభవించినయెడలను దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన యెడలను
- 40 గోధుమలకు ప్రతిగా ముళ్లును యవలకు ప్రతిగా కలుపును మొలచును గాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తము లాయెను.
Job 31
- Details
- Parent Category: Old Testament
- Category: Job
యోబు గ్రంథము చాప్టర్ 31