- 1 యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని ఆ ముగ్గురు మనుష్యులు తెలిసికొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి.
- 2 అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకెయేలు కుమారుడునగు ఎలీహు, యోబు దేవునికంటె తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి ఆతనిమీద బహుగా కోపగించెను.
- 3 మరియు యోబుయొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తర మేమియు చెప్పకయే యోబుమీద దోషము మోపి నందుకు వారిమీద కూడ అతడు బహుగా కోపగించెను.
- 4 వారు ఎలీహుకన్న ఎక్కువ వయస్సుగలవారు గనుక అతడు యోబుతో మాటలాడవలెనని కనిపెట్టి యుండెను.
- 5 అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుష్యులు ప్రత్యుత్తర మేమియు ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను.
- 6 కావున బూజీయుడైన బరకెయేలు కుమారుడగు ఎలీహు ఈలాగు మాట లాడసాగెను నేను పిన్నవయస్సుగలవాడను మీరు బహు వృద్ధులు ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు.
- 7 వృద్ధాప్యము మాటలాడదగును అధిక సంఖ్యగల యేండ్లు జ్ఞానము బోధింపతగునని నేననుకొంటిని;
- 8 అయినను నరులలో ఆత్మ ఒకటి యున్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగ జేయును.
- 9 వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహు వయస్సుగలవారు ఒకప్పుడు న్యాయము తెలి సినవారుకారు.
- 10 కావున నేనునా మాట నంగీకరించుడని మనవి చేసి కొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును.
- 11 ఏమి పలుకుదుమా అని మీరు యోచనచేయుచుండగా నేను మీ మాటలకొరకు కనిపెట్టుకొంటిని మీ అభిప్రాయములు చెవిని వేసికొనుటకై
- 12 మీరు చెప్పినవాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని అయితే మీలో ఎవరును యోబును ఖండింపలేదు ఎవరును అతని మాటలకు ప్రత్యుత్తరమియ్యలేదు.
- 13 కావునమాకు జ్ఞానము లభించినదనియు దేవుడే గాని నరులు అతని జయింపనేరరనియు మీరు పలుకకూడదు.
- 14 అతడు నాతో వాదమాడలేదు మీరు చెప్పిన మాటలనుబట్టి నేనతనికి ప్రత్యుత్తర మియ్యను.
- 15 వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమియ్యకయున్నారు పలుకుటకు వారికి మాటయొకటియు లేదు.
- 16 కాగా వారికనేమియు ప్రత్యుత్తరము చెప్పక యున్నారు వారు మాటలాడక పోవుట చూచి నేను ఊరకుందునా?
- 17 నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేనిచ్చెదను నేనును నా తాత్పర్యము తెలిపెదను.
- 18 నా మనస్సునిండ మాటలున్నవి నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయు చున్నది.
- 19 నా మనస్సు తెరువబడని ద్రాక్షారసపు తిత్తివలె నున్నది క్రొత్త తిత్తులవలె అది పగిలిపోవుటకు సిద్ధముగా నున్నది.
- 20 నేను మాటలాడి ఆయాసము తీర్చుకొనెదను నా పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరమిచ్చెదను.
- 21 మీరు దయచేసి వినుడి నేను ఎవరియెడలను పక్ష పాతినై యుండను. నేను ఎవరికిని ముఖస్తుతికై బిరుదులు పెట్టను
- 22 ముఖస్తుతి చేయుట నా చేత కాదు అట్లు చేసినయెడల నన్ను సృజించినవాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును.
Job 32
- Details
- Parent Category: Old Testament
- Category: Job
యోబు గ్రంథము చాప్టర్ 32