wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


కీర్తనల గ్రంథము చాప్టర్ 35
  • 1 యెహోవా, నాతో వ్యాజ్యెమాడు వారితో వ్యాజ్యె మాడుము నాతో పోరాడువారితో పోరాడుము.
  • 2 కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము.
  • 3 ఈటె దూసి నన్ను తరుమువారిని అడ్డగింపుము నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము.
  • 4 నా ప్రాణము తీయగోరువారికి సిగ్గును అవమానమును కలుగును గాక నాకు కీడుచేయ నాలోచించువారు వెనుకకు మళ్లింప బడి లజ్జపడుదురు గాక.
  • 5 యెహోవా దూత వారిని పారదోలును గాక వారు గాలికి కొట్టుకొనిపోవు పొట్టువలె నుందురు గాక.
  • 6 యెహోవా దూత వారిని తరుమును గాక వారి త్రోవ చీకటియై జారుడుగా నుండును గాక.
  • 7 నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నొడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి.
  • 8 వానికి తెలియకుండ చేటు వానిమీదికి వచ్చును గాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడును గాక వాడు ఆ చేటులోనే పడును గాక.
  • 9 అప్పుడు యెహోవాయందు నేను హర్షించుదును ఆయన రక్షణనుబట్టి నేను సంతోషించుదును.
  • 10 అప్పుడుయెహోవా నీవంటివాడెవడు? మించిన బలముగలవారి చేతినుండి దీనులను దోచుకొనువారి చేతినుండి దీనులను దరిద్రులను విడి పించువాడవు నీవే అని నా యెముకలన్నియు చెప్పుకొనును.
  • 11 కూటసాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులనుగూర్చి నన్ను అడుగుచున్నారు.
  • 12 మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేనివాడనైతిని.
  • 13 వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచు కొంటిని అయినను నా ప్రార్థన నా యెదలోనికే తిరిగి వచ్చి యున్నది.
  • 14 అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతినొందినందున దుఃఖవస్త్రములు ధరించు వానివలె క్రుంగుచుంటిని.
  • 15 నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి.
  • 16 విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలె వారు నా మీద పండ్లుకొరికిరి.
  • 17 ప్రభువా, నీవెన్నాళ్లు చూచుచు ఊరకుందువు? వారు నాశనము చేయకుండ నా ప్రాణమును రక్షిం పుము నా ప్రాణమును సింహముల నోటనుండి విడిపింపుము
  • 18 అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను బహు జనులలో నిన్ను నుతించెదను.
  • 19 నిర్హేతుకముగా నాకు శత్రువులైనవారిని నన్నుగూర్చి సంతోషింపనియ్యకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించువారిని కన్ను గీట నియ్యకుము.
  • 20 వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపటయోచనలు చేయుదురు.
  • 21 నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరచు కొనుచున్నారు. ఆహా ఆహా యిప్పుడు వాని సంగతి మాకు కనబడి నదే అనుచున్నారు.
  • 22 యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా మౌన ముగా నుండకుము నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము.
  • 23 నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యె మాడుటకు లెమ్ము.
  • 24 యెహోవా నా దేవా, నీ నీతినిబట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందురు గాక.
  • 25 ఆహా మా ఆశ తీరెను అని మనస్సులో వారు అను కొనకపోదురు గాక వాని మింగివేసితిమని వారు చెప్పుకొనకయుందురు గాక
  • 26 నా అపాయమునుచూచి సంతోషించువారందరు అవ మానము నొందుదురుగాక లజ్జపడుదురు గాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తిపాలగుదురు గాక
  • 27 నా నిర్దోషత్వమునుబట్టి ఆనందించువారు ఉత్సాహధ్వనిచేసి సంతోషించుదురు గాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు.
  • 28 నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తినిగూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును.