- 1 చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము.
- 2 వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూరవలెనే వాడిపోవుదురు
- 3 యెహోవాయందు నమి్మకయుంచి మేలుచేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము
- 4 యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.
- 5 నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును.
- 6 ఆయన వెలుగునువలె నీ నీతిని మధ్యాహ్నమునువలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును.
- 7 యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్థిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసన పడకుము.
- 8 కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము
- 9 కీడు చేయువారు నిర్మూలమగుదురు యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు.
- 10 ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు.
- 11 దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు
- 12 భక్తిహీనులు నీతిమంతులమీద దురాలోచన చేయుదురు వారినిచూచి పండ్లు కొరుకుదురు.
- 13 వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచు చున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు.
- 14 దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించువారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కు పెట్టి యున్నారు
- 15 వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును.
- 16 నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటె శ్రేష్టము.
- 17 భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు
- 18 నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును.
- 19 ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు కరవు దినములలో వారు తృప్తిపొందుదురు.
- 20 భక్తిహీనులు నశించిపోవుదురు యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలి యుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలె కనబడకపోవుదురు.
- 21 భక్తిహీనులు అప్పుచేసి తీర్చకయుందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు.
- 22 యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు ఆయన శపించినవారు నిర్మూలమగుదురు.
- 23 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును.
- 24 యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు.
- 25 నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు.
- 26 దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపువారు ఆశీర్వదింపబడుదురు.
- 27 కీడు చేయుట మాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు
- 28 ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్న టెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును.
- 29 నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.
- 30 నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును.
- 31 వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు.
- 32 భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని చంపజూతురు.
- 33 వారిచేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషు లుగా ఎంచడు.
- 34 యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు.
- 35 భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి యుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు వర్ధిల్లి యుండెను.
- 36 అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను.
- 37 నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు
- 38 భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము
- 39 బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యెహోవా శరణుజొచ్చి యున్నారు గనుక
- 40 ఆయన భక్తిహీనుల చేతిలోనుండి వారిని విడిపించి రక్షించును.
Psalms 037
- Details
- Parent Category: Old Testament
- Category: Psalms
కీర్తనల గ్రంథము చాప్టర్ 37