- 1 యెహోవా, నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొఱ్ఱపెట్టునాడు
- 2 నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక నా మొఱ్ఱకు చెవి యొగ్గుము
- 3 నేను ఆపదలతో నిండియున్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించియున్నది.
- 4 సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని. నేను త్రాణలేనివానివలె అయితిని.
- 5 చచ్చినవారిలో విడువబడినవాడనైతిని నేను సమాధిలో పడియున్న హతులలో ఒకనివలె అయితిని నీవిక స్మరింపనివారివలె అయితిని వారు నీ చేతిలోనుండి తొలగిపోయి యున్నారు గదా.
- 6 అగాధమైన గుంటలోను చీకటిగల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి యున్నావు.
- 7 నీ ఉగ్రత నామీద బరువుగా నున్నది నీ తరంగములన్నియు నన్ను ముంచుచున్నవి. (సెలా.)
- 8 నా నెళవరులను నాకు దూరముగా నీవు ఉంచి యున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు వెలుపలికి రావల్ల గాకుండ నేను బంధింపబడి యున్నాను
- 9 బాధచేత నా కన్ను క్షీణించుచున్నది యెహోవా, ప్రతిదినము నేను నీకు మొఱ్ఱపెట్టు చున్నాను నీవైపు నా చేతులు చాపుచున్నాను.
- 10 మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా?(సెలా.)
- 11 సమాధిలో నీ కృపను ఎవరైన వివరింతురా? నాశనకూపములో నీ విశ్వాస్యతను ఎవరైన చెప్పు కొందురా?
- 12 అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా?
- 13 యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును.
- 14 యెహోవా, నీవు నన్ను విడుచుట యేల? నీ ముఖము నాకు చాటు చేయుట యేల?
- 15 బాల్యమునుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని నీవు పెట్టు భయముచేత నేను కలవరపడుచున్నాను.
- 16 నీ కోపాగ్ని నా మీదికి పొర్లియున్నది నీ మహా భయములు నన్ను సంహరించి యున్నవి.
- 17 నీళ్లు ఆవరించునట్లు అవి దినమంత నన్ను ఆవరించు చున్నవి అవి నన్ను చుట్టూర చుట్టుకొని యున్నవి
- 18 నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచియున్నావు చీకటియే నాకు బంధువర్గమాయెను.
Psalms 088
- Details
- Parent Category: Old Testament
- Category: Psalms
కీర్తనల గ్రంథము చాప్టర్ 88