- 1 యెహోవాయొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియ జేసెదను.
- 2 కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు నేననుకొనుచున్నాను.
- 3 నేను ఏర్పరచుకొనినవానితో నిబంధన చేసి యున్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను
- 4 తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి యున్నాను. (సెలా.)
- 5 యెహోవా, ఆకాశవైశాల్యము నీ ఆశ్చర్యకార్యము లను స్తుతించుచున్నది పరిశుద్ధదూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి.
- 6 మింటను యెహోవాకు సాటియైనవాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటివాడెవడు?
- 7 పరిశుద్ధదూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టునున్న వారందరికంటె భయంకరుడు.
- 8 యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, యెహోవా, నీవంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యతచేత నీవు ఆవరింపబడియున్నావు.
- 9 సముద్రపు పొంగు నణచువాడవు నీవే దాని తరంగములు లేచునప్పుడు నీవు వాటిని అణచి వేయుచున్నావు.
- 10 చంపబడినదానితో సమానముగా నీవు రహబును, ఐగుప్తును నలిపివేసితివి నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి.
- 11 ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి.
- 12 ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమునుబట్టి ఉత్సాహ ధ్వని చేయుచున్నవి.
- 13 పరాక్రమముగల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణహస్తము ఉన్నతమైనది.
- 14 నీతిన్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు.
- 15 శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచు కొనుచున్నారు.
- 16 నీ నామమునుబట్టి వారు దినమెల్ల హర్షించుచున్నారు. నీ నీతిచేత హెచ్చింపబడుచున్నారు.
- 17 వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీదయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది.
- 18 మా కేడెము యెహోవావశము మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునివాడు.
- 19 అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి యుంటివి నేను ఒక శూరునికి సహాయము చేసియున్నాను ప్రజలలోనుండి యేర్పరచబడిన యొకని నేను హెచ్చించియున్నాను.
- 20 నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధతైలముతో అతని నభిషేకించియున్నాను.
- 21 నా చెయ్యి యెడతెగక అతనికి తోడైయుండును నా బాహుబలము అతని బలపరచును.
- 22 ఏ శత్రువును అతనిమీద జయము నొందడు దోషకారులు అతని బాధపరచరు.
- 23 అతనియెదుట నిలువకుండ అతని విరోధులను నేను పడగొట్టెదను. అతనిమీద పగపట్టువారిని మొత్తెదను.
- 24 నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై యుండును. నా నామమునుబట్టి అతని కొమ్ము హెచ్చింపబడును.
- 25 నేను సముద్రముమీద అతని చేతిని నదులమీద అతని కుడిచేతిని ఉంచెదను.
- 26 నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొఱ్ఱపెట్టును.
- 27 కావున నేను అతని నా జ్యేష్ఠకుమారునిగా చేయు దును భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను.
- 28 నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను నా నిబంధన అతనితో స్థిరముగానుండును.
- 29 శాశ్వతకాలమువరకు అతని సంతానమును ఆకాశమున్నంతవరకు అతని సింహాసనమును నేను నిలిపెదను.
- 30 అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయవిధుల నాచరింపనియెడల
- 31 వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొననియెడల
- 32 నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోను వారిని శిక్షించెదను.
- 33 కాని నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను.
- 34 నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవులగుండ బయలువెళ్లిన మాటను మార్చను.
- 35 అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు
- 36 చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిర పరచబడుననియు
- 37 నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసితిని దావీదుతో నేను అబద్ధమాడను.
- 38 ఇట్లు సెలవిచ్చి యుండియు నీవు మమ్ము విడనాడి విసర్జించియున్నావు నీ అభిషిక్తునిమీద నీవు అధికకోపము చూపి యున్నావు.
- 39 నీ సేవకుని నిబంధన నీకసహ్యమాయెను అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరచి యున్నావు.
- 40 అతని కంచెలన్నియు నీవు తెగగొట్టియున్నావు అతని కోటలు పాడుచేసియున్నావు
- 41 త్రోవను పోవువారందరు అతని దోచుకొనుచున్నారు అతడు తన పొరుగువారికి నిందాస్పదుడాయెను.
- 42 అతని విరోధుల కుడిచేతిని నీవు హెచ్చించియున్నావు అతని శత్రువులనందరిని నీవు సంతోషపరచి యున్నావు
- 43 అతని ఖడ్గము ఏమియు సాధింపకుండ చేసియున్నావు యుద్ధమందు అతని నిలువబెట్టకున్నావు
- 44 అతని వైభవమును మాన్పియున్నావు అతని సింహాసనమును నేల పడగొట్టియున్నావు
- 45 అతని ¸°వనదినములను తగ్గించియున్నావు. సిగ్గుతో అతని కప్పియున్నావు (సెలా.)
- 46 యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును?
- 47 నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసి కొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులనందరిని సృజించి యున్నావు?
- 48 మరణమును చూడక బ్రదుకు నరుడెవడు? పాతాళముయొక్క వశము కాకుండ తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు?
- 49 ప్రభువా, నీ విశ్వాస్యతతోడని నీవు దావీదుతో ప్రమా ణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడ?
- 50 ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసికొనుము బలవంతులైన జనులందరిచేతను నా యెదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసికొనుము.
- 51 యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషిక్తుని నడతలమీద వారు మోపుచున్న నిందలు.
- 52 యెహోవా నిత్యము స్తుతినొందును గాక ఆమేన్ ఆమేన్.
Psalms 089
- Details
- Parent Category: Old Testament
- Category: Psalms
కీర్తనల గ్రంథము చాప్టర్ 89